గ‌రుడ ప్ర‌సాదం తింటే నిజంగానే పిల్ల‌లు పుడుతారా..? ఆగ‌మ శాస్త్రం ఏం చెబుతోంది..?

గ‌రుడ ప్ర‌సాదం.. ఈ పేరు నిన్న‌టి నుంచి సోష‌ల్ మీడియాలో, వార్తాప‌త్రిక‌లు, ఎల‌క్ట్రానిక్ మీడియాలో మార్మోగుతోంది. ఈ ప్ర‌సాదం కోసం చిలుకూరు బాలాజీ ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తారు

  • Publish Date - April 20, 2024 / 03:44 PM IST

గ‌రుడ ప్ర‌సాదం.. ఈ పేరు నిన్న‌టి నుంచి సోష‌ల్ మీడియాలో, వార్తాప‌త్రిక‌లు, ఎల‌క్ట్రానిక్ మీడియాలో మార్మోగుతోంది. ఈ ప్ర‌సాదం కోసం చిలుకూరు బాలాజీ ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తారు. దీంతో చిలుకూరు బాలాజీ ఆల‌యానికి వెళ్లే దారులన్నీ వాహ‌నాల‌తో నిండిపోయాయి. ఆ దారుల్లో కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డి చాలా మంది ఇబ్బందులు ప‌డ్డారు. మ‌రి ఈ ప్ర‌సాదం కోసం ఎందుకు ఎగ‌బ‌డ్డారు..? ఆ ప్ర‌సాదం తింటే నిజంగానే సంతానం క‌లుగుతుందా..? ఆగ‌మ శాస్త్రం ఏం చెబుతోంది..? అనే విష‌యాల‌ను తెలుసుకుందాం..

చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో ప్ర‌తి ఏడాది చైత్ర మాసంలో బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగుతుంటాయి. శ్రీరామ‌న‌వ‌మి త‌ర్వాత రెండో రోజు.. అంటే తెలుగు నెల‌ల ప్ర‌కారం చూస్తే చైత్ర మాసం ఏకాద‌శి రోజున బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి. బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా తొలి రోజు గ‌రుత్మంతుడి పూజ చేసి, ధ్వ‌జారోహ‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. ఈ పూజ సంద‌ర్భంగా గ‌రుత్మంతుడికి పెద్ద బుట్ట‌లో నైవేద్యం పెడ‌తారు. పూజా కార్య‌క్ర‌మాలు ముగిసిన అనంత‌రం ఆ నైవేద్యాన్ని ముద్ద‌ల రూపంలో మ‌హిళా భ‌క్తుల‌కు పంపిణీ చేస్తుంటారు. ఈ ప్ర‌సాదాన్ని గరుడపిండం లేక గరుత్మంతుని నైవేద్యం లేదా గ‌రుడ ప్ర‌సాదం అని పిలుస్తారు. ఈ ప్ర‌సాదం పంపిణీ ఇవాళే కాదు.. ఎన్నో ఏండ్లుగా కొన‌సాగుతుంది. ఇక ఈ ప్ర‌సాదం తింటే సంతానం క‌లుగుతుంద‌ని ఆల‌య అర్చ‌కుల విశ్వాసం. దీంతో సంతానం క‌ల‌గ‌ని మ‌హిళ‌ల‌కు గ‌రుడ ప్ర‌సాదంగా ఆ నైవేద్యాన్ని పంపిణీ చేస్తుంటారు. ఈ ప్ర‌సాదం తిన్న మ‌హిళ‌ల్లో చాలా మంది గ‌ర్భం దాల్చినట్లు ఆల‌య అర్చ‌కులు పేర్కొన్నారు.

ఇక ఈ ప్ర‌సాదం గురించి తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా ఈ ప్రసాదం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బాలాజీ ఆలయానికి పోటెత్తారు. ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కే ల‌క్ష‌ల మంది భ‌క్తులు ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్నారు. గ‌రుడ ప్ర‌సాద కోసం ఎగ‌బ‌డ్డారు.

మ‌రి ఆగ‌మ శాస్త్రం ఏం చెబుతోంది..?

‌యాస్త్రీ పిండం అశ్నాతి తాస్త్రీ పుత్రవతీ భవేత్…

ఏ స్త్రీ ఈ గరుడపిండాన్ని ప్రసాదంగా భావించి తింటుందో, ఆ స్త్రీ సంతానవతి అవుతుంది అని ఆగమ శ్లోకం అర్థం. కొన్ని సంవత్సరాల క్రితం, ఈ విషయాన్ని మెల్లగా ఆలయానికి వచ్చిన కొందరికి పూజారులు చెప్పార‌ట‌. అప్పట్లో ప్రసాదం తీసుకున్న భక్తులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. అత్యంత శ‌క్తివంత‌మైన ఆ ప్ర‌సాదాన్ని తిన్న వారంతా దాదాపు గర్భవతులయ్యార‌ట‌. అలా ఆ నోటా ఈ నోటా విని ఇప్పుడు కొన్ని వేల మంది ప్రత్యేక ప్రసాదం స్వీకరించిన వారికి సంతాన భాగ్యం కలిగింద‌ని న‌మ్మ‌కం ఏర్ప‌డింది. 2019లో ఈ ప్ర‌సాదాన్ని మ‌రింత ప్రాచుర్యం ల‌భించింది. ఇక అప్ప‌ట్నుంచి ప్ర‌తి ఏడాది ఆల‌యానికి తండోప‌తండాలుగా మ‌హిళ‌లు త‌ర‌లివ‌స్తున్నారు. ప్ర‌సాదం తిన్నాక సంతానం క‌లిగిన వారు కూడా, త‌మ పిల్ల‌ల‌ను ఆల‌యానికి తీసుకొచ్చి.. గ‌రుడు ప్ర‌సాదం ఫ‌లితమ‌ని చెప్తున్న‌ట్లు తెలిసింది.

Latest News