Simha Vahana Seva | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజైన ఆదివారం ఉదయం మలయప్పస్వామి సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా సాగింది. శ్రీవారు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముయమైంది.
సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన జీయర్‌స్వామి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ ఎన్ చక్రవర్తి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, టీటీడీ ఈవో జే శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి దంపతులు, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్ పాల్గొన్నారు.