శ్రీరాముడికి ప్రధాని తొలిహారతి, పట్టు వస్త్రాలు, వెండి కిరీటం సమర్పణ

శ్రీరామ..నామం పేరు మాత్రమే కాదు. భక్తజనకోటి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వేదమంత్రం. ఆనాడు.. హనుమంతుడికి సీతమ్మ ఇచ్చిన ముత్యాలహారంలో తన రామయ్య జాడ లేదని

  • Publish Date - January 22, 2024 / 11:37 AM IST

అయోధ్య: శ్రీరామ..నామం పేరు మాత్రమే కాదు. భక్తజనకోటి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వేదమంత్రం. ఆనాడు.. హనుమంతుడికి సీతమ్మ ఇచ్చిన ముత్యాలహారంలో తన రామయ్య జాడ లేదని తిరస్కరించిన ఆ పవనసుతుడే రామభక్తిలో మనందరికీ ఆదర్శం. పట్టాభిషిక్తుడి రాజ్యాన్ని పరిపాలిస్తాడని అంతా భావిస్తున్న సమయంలో తండ్రి మాటను ధిక్కరించలేక 14 ఏళ్లు అరణ్యవాసం చేసిన ఆ రాఘవుడు మళ్లీ తమ రాజ్యానికి విచ్చేసిన ఆధ్యాత్మిక సంబురంలో అయోధ్య నగరం పులకరించింది. నిర్ణయించిన సమయానికే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ప్రారంభమైంది. 11 రోజులుగా ఉపవాసంలో ఉన్న ప్రధాని మోదీ శ్రీరామచంద్రుడికి పట్టువస్త్రాలు, వెండి కిరీటం సమర్పించారు. 12 గంటల 29 నిమిషాలకు అభిజిత్‌ లగ్న శుభముహూర్తాన బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యింది. స్వామివారికి మొదటి హారతి ప్రధాని మోదీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ కూడా పాల్గొన్నారు. దేశంలోని ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం శ్రీరామచంద్రుడి ఫొటోలు మొట్టమొదటిసారిగా బయటికి వచ్చాయి. దివ్యమైన రూపంతో భక్తులకు శ్రీరాముడు దర్శనమిచ్చాడు. రాముడిని చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదని భక్తులు చెబుతున్నారు.