న్యూఢిల్లీ : అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చిన స్థానంలో నిర్మించిన రామాలయంలో బాల రాముడికి సోమవారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయోధ్యలో రామమందిరం అంశంపైనే ఎదిగిన బీజేపీ.. తన పదేళ్లపాలన ముగింపు దశకు వస్తున్న సమయంలో రామాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ సొంత కార్యక్రమంలా నిర్వహిస్తున్నారని పలు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ కార్యక్రమం కోసం కొన్ని రాష్ట్రాలు సెలవు కూడా ప్రకటించాయి. కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ సెలవు ప్రకటించగా.. ప్రతిపక్ష డీఎంకే అధికారంలో ఉన్న తమిళనాడులో కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని నిషేధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. అయితే.. అవన్నీ దుష్ర్పచారాలేనని అధికార డీఎంకే కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే.. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఉదయం అయోధ్యకు చేరుకోనున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు రామనగరిలోనే ఉండనున్నారు. తొలుత ఒక రోజు ముందే మోదీ వస్తారని వార్తలు వచ్చినా.. కార్యక్రమం రోజునే ఆయన అయోధ్యకు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 10.25 గంటలకు ప్రత్యేక విమానంలో మోదీ నేరుగా మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీరామజన్మభూమి ప్రాంతానికి వెళతారని అధికారులు పేర్కొన్నారు. అక్కడ ఆయన దాదాపు మూడు గంటలు ఉంటారు. బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు మోదీ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జటాయువు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని సమాచారం. అనంతరం 12.05 గంటల నుంచి 12.55 గంటల వరకూ సాగే రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. బాల రాముడి విగ్రహానికి కప్పించి ఉంచిన వస్త్రాన్ని ప్రధాని సమక్షంలో తొలగిస్తారు. బంగారు తీగెతో రాముడి విగ్రహానికి కాటుకను మోదీ అద్దుతారు. అనంతరం రాముడికి అద్దం చూపిస్తారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తర్వాత కార్యక్రమ వేదిక వద్దకు మధ్యాహ్నం 1 గంటకు చేరుకుని, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి 2.10 గంటలకు కుబేర్ తిల వద్దకు చేరుకుంటారు. అక్కడి శివాలయంలో పూజలు నిర్వహిస్తారు. కార్యక్రమాలు ముగించుకుని సాయంత్రం 3.30 గంటలకు ఆయన తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళతారని అంచనా వేస్తున్నారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
అయోధ్య రామాలయంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్‌ఎస్‌జీ శిక్షణ పొందిన పురుష, మహిళా యూపీఎస్‌ఎస్‌ఎఫ్ కమెండోలను ప్రత్యేకంగా నియమించారు. మొత్తం ఆలయ ప్రాంగణానికి గట్టి రక్షణ కవచం ఏర్పర్చారు. మొత్తం 1450 మంది భద్రతా సిబ్బందిని నియమించారు. భద్రతా ఏర్పాట్లను అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎల్‌వీ ఆంటోనీ దేవ్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
అయోధ్య ఆలయాన్ని పేల్చేస్తానన్న వ్యక్తి అరెస్ట్
అయోధ్యలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగే జనవరి 22న ఆ ఆలయాన్ని పేల్చేస్తానని ఒక వ్యక్తి చేసిన బెదింపు ఫోన్ కాల్ సంచలనం రేపింది. ఈ ఘటనలో బీహార్‌లోని అరారియా జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఇంతెఖాబ్ ఆలమ్‌గా గుర్తించారు. అతడిని పలాసి పోలీస్ స్టేషన్ పరిధిలోని బలువా కాలియాగంజ్‌లోని తన ఇంట్లో పోలీసులు శనివారం బాగా పొద్దుపోయిన తర్వాత అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సింగ్ తెలిపారు. జనవరి 19న పౌరుల అత్యవసర సేవల విభాగం నంబర్ అయిన 112కు ఫోన్ చేసిన నిందితుడు.. తన పేరు చోటా షకీల్ అని, దావూద్ ఇబ్రహీంకు తాను సన్నిహితుడినని ఆలం చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ‘జనవరి 22న అయోధ్య రామాలయాన్ని పేల్చివేస్తానని చెప్పాడు. ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేకున్నా.. అతడి మానసిక స్థితి సరిగా లేదని గుర్తించాం’ అని ఎస్పీ తెలిపారు. అంశం సున్నితమైనది కావడంతో పలాసి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అతడి మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెదిరింపు కాల్ విషయం తెలియగానే సైబర్ సెల్ ద్వారా సదరు నంబర్ వివరాలు రాబట్టామని ఆయన తెలిపారు. నిందితుడు కాల్ చేసిన ఫోన్ అతని తండ్రి పేరుతో ఉన్నదని చెప్పారు.
ఎయిమ్స్‌లో సెలవు.. లేదు లేదు!
జనవరి 22న అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో అత్యుత్సాహంతో హాఫ్‌డే సెలవు ప్రకటించిన ఢిల్లీలోని ఎయిమ్స్.. నాలుక కరుచుకుని.. తిరిగి దానిని రద్దు చేసింది. పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను.. సోమవారం ఎయిమ్స్‌లోని ఓపీ సహా అన్ని విభాగాలు యథావిధిగా పనిచేస్తాయని తాజా మెమొరాండంలో పేర్కొన్నారు. అంతకు ముందు శనివారం జారీ చేసిన మెమోరాండంలో జనవరి 22న మధ్యాహ్నం రెండున్నర వరకూ సెలవు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. క్రిటికల్ విభాగాలు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని పనేర్కొన్నారు. అయితే.. ఎయిమ్స్ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కొందరు రోగులు అపాయింట్‌మెంట్ కోసం వారాల తరబడి, కొన్నిసార్లు నెలలతరబడి ఎదురు చూస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర ఆత్రహం వ్యక్తం చేశాయి. ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఓపీడీని మూసివేస్తే ఢిల్లీ వెలుపలి నుంచి వచ్చేవారంతా తీవ్రంగా ఇబ్బంది పడతారని పేర్కొన్నాయి. తమ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ఎయిమ్స్.. సెలవును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.