Kumbh Mela | మహా కుంభమేళా.. దేశం నలుమూలల నుంచే కాకుండా.. విదేశాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి.. త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. 144 ఏండ్లకు ఒకసారి వచ్చే ఈ అత్యంత అరుదైన కుంభమేళా.. శివరాత్రి పర్వదినంతో ముగిసింది. 45 రోజుల్లో 66.21 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు హాజరై గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక గతంలో 1881లో జరిగిన మహా కుంభమేళా మళ్లీ 2169 సంవత్సరంలో రానుంది. ఇప్పుడున్న వాళ్లు ఎవరూ ఆ కుంభమేళాను చూడలేకపోవచ్చు. రాబోయే తరాలు ఆ మహా ఘట్టంలో భాగం కానున్నాయి.
మరో రెండేండ్లలో అర్థ, పూర్ణ కుంభమేళాలు..?
మహా కుంభమేళా ముగిసింది.. ఇక రాబోయేది అర్థ కుంభమేళా, పూర్ణ కుంభమేళా. ఈ రెండు కుంభమేళాలు 2027లో జరగనున్నాయి. అర్థ కుంభమేళాకు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వేదిక కానుంది. అర్థ కుంభమేళాను ఆరేండ్లకు ఒకసారి నిర్వహిస్తారు. చివరి సారి అర్థకుంభమేళాను 2021లో హరిద్వార్‌లో నిర్వహించారు. ఈ క్రమంలో 2027లో అర్ధ కుంభమేళా నిర్వహించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.
పూర్ణ కుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. 12 ఏళ్ల తర్వాత వస్తున్న పూర్ణ కుంభమేళా ఈసారి 2027లో నాసిక్‌లో జరగనుంది. పూర్ణ కుంభమేళా జూలై 17, 2027న ప్రారంభమై, ఆగస్టు 17, 2027న ముగియనున్నట్లు తెలుస్తోంది. ఇది నాసిక్ నుంచి సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నది ఒడ్డున ఉన్న త్రయంబకేశ్వర్‌లో జరగనుంది.
కుంభమేళా ఎన్ని రకాలో తెలుసా..
కుంభమేళా – ప్రతి నాలుగేళ్లకు ఓసారి నిర్వహిస్తారు
అర్ధ కుంభమేళా – ఆరేళ్లకు ఓసారి జరుగుతుంది
పూర్ణ కుంభమేళా -12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు
మహా కుంభమేళా – 144 సంవత్సరాలకు ఓసారి నిర్వహిస్తారు