Raksha Bandhan 2024 | సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు సంబంధించిన పండుగగా రక్షా బంధన్( Raksha Bandhan )ను దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. రక్షా బంధన్ రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ( Rakhi Festival ) కడతారు. ఆ తర్వాత సోదరుల నుంచి ఆశీస్సులు తీసుకుని, వారు ఇచ్చిన బహుమతులను స్వీకరిస్తుంటారు. రాఖీ కట్టడం వల్ల తమ సోదరుడు ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటారని నమ్ముతారు. సోదరులు కూడా సోదరీమణులకు అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు. సోదర సోదరీమణుల మధ్య అనుబంధాన్ని పెంచే ఈ పర్వదినాన ఏ సమయంలో రాఖీ కట్టాలి..? ఏ సమయంలో రాఖీ కట్టకూడదు..? అనే విషయాలు తెలుసుకుందాం..
ఈ ఏడాది ఆగస్టు 19, 2024 సోమవారం నాడు రాఖీ పౌర్ణమి జరుపుకోనున్నారు. ఆగస్టు 19వ తేదీ సోమవారం ఉదయం శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమి తిథి తెల్లవారుజామున 3:04 గంటలకు ప్రారంభమై, అదే రోజు రాత్రి 11:55 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలోనే భద్రకాలం కూడా వస్తుంది. ఈ భద్రకాలంలో అసలు రాఖీ కట్టకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. ఈ సంవత్సరం రాఖీ పూర్ణిమ రోజున అద్భుతమైన గ్రహ సంయోగం కూడా జరుగుతోంది. జ్యోతిష్యం ప్రకారం 90 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది రాఖీ పండగ రోజున నాలుగు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో రాఖీ కట్టడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
ఏ సమయంలో రాఖీ కడితే మంచిది..?
ఈ రాఖీ పండుగ రోజున.. అంటే సోమవారం మధ్యాహ్నం 1:33 గంటల నుంచి రాత్రి 9:08 గంటల వరకు శుభ సమయంగా చెబుతున్నారు. అందులోనూ రెండు ప్రత్యేకమైన ముహూర్తాలలో కడితే విశేషమైన ఫలితాలు కలుగుతాయని.. సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
అపరాహ్న రాఖీ బంధన ముహూర్తం: మధ్యాహ్నం 1:43 గంటల నుంచి సాయంత్రం 4:20గంటల వరకు.
ప్రదోష కాల సమయం: సాయంత్రం 6:56 గంటల నుంచి రాత్రి 9:08 గంటల మధ్య సమయంలో రాఖీ కట్టుకోవచ్చు.
భద్రకాలంలో రాఖీ అసలు కట్టకూడదు..
భద్ర కాలం సమయం 2024 ఆగస్టు 19 సోమవారం నాడు సూర్యోదయాన 5:53 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1:32 గంటల వరకు ఉంటుంది. అందుకే ఈ సమయం పూర్తయ్యాకే రాఖీ పండగను జరుపుకోవాలని సూచిస్తున్నారు.