Site icon vidhaatha

CBSE Exams | ఇకపై ఏడాదికి రెండు సార్లు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు.. కేంద్రం కసరత్తు..!

CBSE Exams : ఇక నుంచి సీబీఎస్‌ఈ (CBSE) పదోతరగతి, ఇంటర్‌ బోర్డు పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించేలా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తున్నది. వచ్చే ఏడాది (2025) నుంచే ఈ నూతన విధానాన్ని అమలు చేసేలా వ్యూహ రచన చేయాలని సీబీఎస్‌ఈని కోరింది. అయితే ఈ పరీక్షల్లో సెమిస్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని తెలుస్తోంది.

ఏడాదిలో రెండుసార్లు సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల అంశంపై పాఠశాలల ప్రిన్సిపల్స్‌తో వచ్చే నెలలో బోర్డు సంప్రదింపులు జరపనుంది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ అడ్మిషన్‌ షెడ్యూల్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా రెండో దఫా బోర్డు పరీక్షలు నిర్వహించేలా అకడమిక్‌ క్యాలెండర్‌ను సిద్ధం చేసేందుకు విధివిధానాలను రూపొందించే పనిలో సీబీఎస్‌ఈ అధికారులు నిమగ్నమయ్యారు.

కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ నూతన విద్యావిధానానికి అనుగుణంగా సీబీఎస్‌ఈ పరీక్షల్లో మార్పులు చేయాలని నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (NCF) ముసాయిదా కమిటీ గతంలో సూచించింది. ఇస్రో మాజీ చైర్మన్‌ కస్తూరిరంగన్‌ సారథ్యంలోని ఈ కమిటీ 11, 12 తరగతి విద్యార్థులకు సెమిస్టర్‌ విధానాన్ని కూడా సూచించింది. ఈ ఫ్రేమ్‌ వర్క్‌ను కేంద్ర హెచ్‌ఆర్‌డీ శాఖ గత ఏడాది ఆగస్టులో విడుదల చేసింది.

Exit mobile version