Kaantha Review: A Creative Clash… A Crime… A Suspenseful Finale
1950ల కాలం నాటి సినిమా ప్రపంచాన్ని తిరిగి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నమే కాంత. గురు–శిష్యుల మధ్య వచ్చిన అభిప్రాయభేదాలు, సినిమా షూటింగులో జరిగే అంతర్గత సమస్యలు, చివరికి కథలో ఒక హత్య మిస్టరీ—ఇవి అన్నీ కలిసి ఓ వింటేజ్–డ్రామాకి రూపం కల్పించాయి. దుల్కర్ సల్మాన్, సముద్రఖని, రానా దగ్గుబాటి వంటి నటులు స్క్రీన్‌పై పూర్తిగా సీరియస్‌గా కనిపిస్తారు. విజువల్స్, సెట్స్, ఆర్ట్‌వర్క్ సినిమా మొదటి నుంచే ప్రత్యేకంగా నిలుస్తాయి. కానీ కథలోని రెండో భాగం మాత్రం కొద్ది చోట్ల బాగా నెమ్మదిగా సాగుతుంది.
ఇంతకీ ‘కాంత’ కథ (Story) ఏంటీ?
అయ్య (సముద్రఖని) ఒక ప్రముఖ దర్శకుడు. తన తల్లి ‘శాంత’ జీవితాన్ని సినిమాగా తీయాలని సంవత్సరాలుగా ఎదురు చూస్తుంటాడు. ఆయన శిష్యుడు టీకే మహదేవన్ (దుల్కర్ సల్మాన్) ఒకప్పుడు చిన్న నటుడే, కానీ అయ్య కారణంగా ఇప్పుడు పెద్ద సూపర్ స్టార్ అయ్యాడు. కానీ ఒక సంఘటన కారణంగా అయ్య–మహదేవన్ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. దాంతో ‘శాంత’ సినిమా మధ్యలో ఆగిపోతుంది. కొన్నేళ్ల తర్వాత అదే సినిమా మళ్లీ ప్రారంభమవుతుంది, అయితే ఈసారి మహదేవన్ షరతు పెడతాడు—
“కథ నేను చెప్పినట్టు ఉండాలి… క్లైమాక్స్ కూడా మార్చాలి… సినిమా పేరు శాంత కాకుండా ‘కాంత’ అని పెట్టాలి.”
అయ్య తనకిష్టం లేకపోయినా, సినిమా పూర్తిచేయాలని ఒప్పుకుంటాడు. హీరోయిన్‌గా కొత్త అమ్మాయి—కుమారి (భాగ్యశ్రీ బోర్సే)ని తీసుకుంటారు. ఆమె హీరో మహదేవన్‌తో ప్రేమలో పడుతుంది.
షూటింగ్ జరుగుతూ ఉండగా—ఇంతలో, యూనిట్‌లో ఒకరు రహస్యంగా హత్యకు గురవుతారు.
అక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఇన్‌స్పెక్టర్ దేవరాజ్ (రానా దగ్గుబాటి) ఎంట్రీ ఇస్తాడు. అయ్య–మహదేవన్ ఇద్దరూ ఒకరినొకరు అనుమానిస్తారు. చివరికి నిజమైన హంతకుడు ఎవరు? ఎందుకు చేశాడు? అది సినిమా క్లైమాక్స్‌లో తెలుస్తుంది.
బలాలు (Strengths)
- 1950ల వింటేజ్ సినీ వాతావరణం అద్భుతంగా రీక్రియేట్ చేయడం
- దుల్కర్–సముద్రఖని మధ్య ఘర్షణ సీన్లు బాగా పండడం
- ఆర్ట్ వర్క్, కెమెరా వర్క్ సినిమాకు బలం
- క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు అద్బుతంగా ఉండటం
- రానా వచ్చిన తర్వాత కథలో సీరియస్ టోన్ పెరగడం
బలహీనతలు (Weaknesses)
- రెండో భాగంలో కథ చాలా నెమ్మదిగా అనిపించడం
- హత్య విచారణ సీన్లు కొన్నిచోట్ల లాగింగ్గా అనిపించడం
- తెలుగు డబ్బింగ్ కొన్ని డైలాగుల్లో అస్పష్టంగా ఉండటం
- గురు–శిష్యుల మధ్య వచ్చిన గొడవకు స్పష్టమైన కారణం లోతుగా చూపించకపోవడం
- కొందరికి సినిమా మొత్తం థియేట్రికల్‌గా, క్లాసికల్‌గా అనిపించి కమర్షియల్ విలువలు తగ్గడం
నటీనటులు (Cast)
- దుల్కర్ సల్మాన్ — మహదేవన్ పాత్రలో అద్భుతం. క్లోజప్లలో ఎక్స్ప్రెషన్స్ హైలైట్. నటనలో అపూర్వ పరిణితిని ప్రదర్శించాడు.
- సముద్రఖని — అయ్య పాత్రలో రెండు కోణాలు నమ్మదగిన రీతిలో చేశారు.
- భాగ్యశ్రీ బోర్సే — పాతకాలపు హీరోయిన్‌గా బాగా సరిపోయింది.; నటన కూడా ఆశ్చర్యపరిచింది.
- రానా దగ్గుబాటి — చిన్న పాత్రే అయినా ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా బలమైన ముద్ర వేసాడు.
- ఇతర పాత్రలు — అందరూ దర్శకుడి ఆకాంక్ష మేరకు నటించారు.
టెక్నికల్ రివ్యూ (Technical Review)
- కెమెరా వర్క్: డానీ సాంచెజ్ లోపెజ్ కెమెరా చిత్రానికి ప్రాణంలా నిలిచింది. ప్రతి షాట్ పెయింటింగ్‌లా కనిపిస్తుంది.
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: జేక్స్ బిజోయ్ సంగీతం మంచి వింటేజ్ టోన్ తెచ్చింది.
- ఆర్ట్ వర్క్: 1950ల సెట్స్, మేకప్, లైటింగ్ చాలా ప్రామాణికంగా ఉన్నాయి.
- ఎడిటింగ్: మొదటి భాగం కట్టుదిట్టంగా ఉన్నా, రెండో భాగంలో మరింత టైట్‌గా ఉండాల్సంది.
- డబ్బింగ్: తెలుగు వెర్షన్లో కొంత ఇబ్బందికరంగా ఉంది.
దర్శకుడి పనితనం (Director’s Work)
సెల్వమణి సెల్వరాజ్ ఎంచుకున్న కథ చాలా కళాత్మకమైనది, క్లిష్టమైనది. సినిమాలో సినిమాను తీసే ప్రక్రియను బాగా చూపించారు. గురు–శిష్యుల సంబంధం, అందులోని ఈగో, కళాత్మక తగాదాలు బాగా రాసుకున్నారు. అయితే — మిస్టరీని హ్యాండిల్ చేయడంతో మరింత శ్రద్ధ పెట్టాల్సిందని అనిపిస్తుంది. కథాగమనవేగంలో కొంత మందకొడితనం ఉంది. కానీ మొత్తంగా చూస్తే, వింటేజ్ సినిమా ప్రేమికులకు ఆయన పని బాగానే నచ్చుతుంది.
పాతకాలపు సినిమాలు నచ్చే ప్రేక్షకులకు పండుగ లాంటిది. ఈతరానికి బోర్‌గా ఉండొచ్చు కానీ, ఓపికగా ఉంటే నచ్చే సినిమా.
విధాత రేటింగ్ : 2.75 / 5
