Actress | సీనియర్ నటి జయలలిత తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించి సహనటిగా, కమెడియన్‌గా తనదైన ముద్ర వేశారు. అప్పట్లో గ్లామర్ పాత్రలతోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కమల్ హాసన్ నటించిన ‘ఇంద్రుడు చంద్రుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన జయలలిత, ఆ తర్వాత మామ అల్లుడు, లారీ డ్రైవర్, అప్పుల అప్పారావు, జంబలకిడి పంబా, మెకానిక్ అల్లుడు, ముఠా మేస్త్రీ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఒకప్పుడు సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించిన ఆమె, ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ చేస్తూ బిజీగా కొనసాగుతున్నారు. ‘బంగారు గాజులు’, ‘ప్రేమ ఎంత మధురం’ వంటి సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
కెరీర్ పీక్‌లోనే వివాహం
కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే మలయాళీ దర్శకుడు వినోద్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు జయలలిత. ఏడేళ్ల ప్రేమ తర్వాత పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయలలిత పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘ఇంద్రుడు చంద్రుడు’ సినిమాకు తాను కేవలం రూ.1 లక్ష పారితోషికం మాత్రమే తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే ఓ మలయాళం సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
మొదటిసారి మలయాళంలో సినిమా కోసం వెళ్లినప్పుడు భాష కూడా రాకపోవడంతో ఇబ్బంది పడ్డానని, ఆ సమయంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లైంగిక దాడి సీన్ వివరించాలంటూ తనను గదిలోకి పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపారు. ఆ ఘటన జరిగిన ఆరు నెలలకే ఆ వ్యక్తి మరణించాడని, అతడు ఎలా చనిపోయాడో తనకు తెలియదని పేర్కొన్నారు.
చేజారిన ‘ఖైదీ’ అవకాశం
ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ’ సినిమాలో హీరోయిన్ పాత్ర తనకు రావాల్సిందని, కానీ తాను చేసిన వ్యాంప్ పాత్రల కారణంగానే ఆ అవకాశం చేజారిపోయిందని జయలలిత చెప్పారు. కెరీర్ ప్రారంభంలో ఇలాంటి కారణాల వల్ల చాలా అవకాశాలు కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, జయలలిత స్మాల్ స్క్రీన్‌పై సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
