India-Pakistan T20 Clash | సాధారణంగానే భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య క్రికెట్ మ్యాచ్ ఉందంటే ఆ హడావుడే వేరుంటుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తారు. భారత అభిమానులైతే చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆశపడుతుంటారు. ఇందుకోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎంత ఖర్చు పెట్టైనా టికెట్ కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup)లో భాగంగా భారత్-పాక్ జట్లు కొలంబో వేదికగా తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొలంబో వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
భారత్-పాక్ మధ్య మ్యాచ్.. టీవీ రేటింగ్స్, స్టేడియం టికెట్లు, స్పాన్సర్ ఆదాయం అన్నింటికీ కీలకంగా ఉంటుంది. విమాన టికెట్ ధరలు కూడా పెరుగుతాయి (Flight ticket prices). ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారత్ నుంచి కొలంబో వెళ్లే విమాన టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 15న మ్యాచ్ షెడ్యూల్ ఖరారు కాగానే.. విమాన టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ముంబై-కొలంబో-ముంబై మధ్య టికెట్ ధరలు రౌండ్ ట్రిప్‌కు ఛార్జీలు ఏకంగా రూ.10,000 పెరగడం గమనార్హం.
పలు నివేదికల ప్రకారం.. ఫిబ్రవరి 15న మ్యాచ్ జరిగే రోజు ముంబై-కొలంబో-ముంబై మధ్య విమాన టికెట్ ఛార్జీ 60 వేలుగా ఉంది. ఇక చంఢీగడ్ నుంచి కొలంబోకు ఎయిర్ ఇండియా రౌంట్ ట్రిప్ టికెట్ ధర సుమారు రూ.65 వేల వరకూ ఉంది. అటు ఇండిగో సంస్థ కూడా టికెట్ ధరలను పెంచింది. ఇండిగో రౌండ్ ట్రిప్‌కు రూ.70 వేల నుంచి రూ.74 వేలు వసూలు చేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ-కొలంబో మధ్య విమాన ఛార్జీలు రూ.50 వేల వరకూ ఉన్నాయి.
భారత్–పాక్ మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్‌తో ఆడబోమంటూ పాకిస్థాన్ తీసుకున్న బాయ్‌కాట్ నిర్ణయంపై నెలకొన్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. పలు చర్చల అనంతరం భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాక్ అంగీకరించింది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్-పాకిస్థాన్ గ్రూప్ మ్యాచ్ జరగనుంది. దీంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Girl Child | ఆ ఆడబిడ్డకు 130 గ్రామాల ఆశీర్వాదం..! ప్రత్యేకత తెలిస్తే షాక్..!!
Chandipur Beach | ఈ బీచ్ రోజుకు రెండుసార్లు మాయమైపోతుందంట.. ఎక్కడుందో తెలుసా..?
