ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి: కాంబోడియా
ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతిదూత అవతారంలా కనిపిస్తున్నారు. నోబెల్ శాంతి పురస్కారానికి ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్‌ను నామినేట్ చేస్తామని పాకిస్తాన్ ప్రకటించిన విషయం తెలిసిందే

నాంఫెన్ : ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతిదూత అవతారంలా కనిపిస్తున్నారు. నోబెల్ శాంతి పురస్కారానికి ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్‌ను నామినేట్ చేస్తామని పాకిస్తాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో కాంబోడియా కూడా చేరింది. రెండు విషయాల్లో కృతజ్ఞత తెలుపుకొనేందుకు ఈ ప్రతిపాదన తెచ్చింది. కాంబోడియాపై విధించిన 49 శాతం టారిఫ్‌ను ట్రంప్ 19 శాతానికి పరిమితం చేశారు. థాయిలాండ్, కాంబోడియా మధ్య కాల్పుల విరమణకు కృషి చేసిన అమెరికా అధ్యక్షుడికి నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని తాము ప్రతిపాదిస్తామని కాంబోడియా ఉప ప్రధాన మంత్రి సన్ ఛాంత్రోల్ ప్రకటించారు. దీనిని ఆయన స్వయంగా తమకు ధృవీకరించారని రాయిటర్స్ తెలిపింది. తమ దేశంపై టారిఫ్‌ను 19 శాతానికి పరిమితం చేసినందుకు కూడా ట్రంప్‌కు ఆయన కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. దీనికి ప్రతిగా అమెరికా దిగుమతులపై జీరో టారిఫ్ అమలు చేస్తామని తెలిపారు.
అంతకు ముందు శుక్రవారం మీడియాతో మాట్లాడిన వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్.. ‘డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలి’ అని అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య సహా ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘర్షణలను నివారించడంలో ట్రంప్ కృషి చేశారని ఆయన పేర్కొన్నారు.
గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణను నివారించినందుకు పాక్ ఈ ప్రతిపాదన చేసింది.
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే ఒప్పించానని డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ముందు రోజు రాత్రంతా తాము జరిపిన సంప్రదింపులతోనే ఈ ఒప్పందం కుదిరిందని ఆయన చెబుతూ వస్తున్నారు. అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలను చర్చల్లో కూర్చొనబెట్టడంలో అమెరికా కీలక పాత్ర పోషించిందనేది ఆయన వాదన. అయితే.. ఇటీవల భారత పార్లమెంటులో చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ట్రంప్ వ్యాఖ్యలను నేరుగా తిరస్కరించలేదు కానీ.. తమ కాల్పుల విరమణలో ఏ విదేశీ నేత జోక్యం లేదని చెప్పారు. పాకిస్తాన్ ఇక తమ వల్ల కాదని చేతులెత్తేసి బతిమలాడితే కాల్పులు విరమించామని తెలిపారు.