Actress | తెలంగాణలోని ప్రముఖ గిరిజన పండుగ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో మేడారానికి తరలివస్తున్నారు. ఈ జాతరలో వనదేవతలకు “బంగారం”గా పిలవబడే బెల్లంతో తులాభారం వేయించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఈ సంప్రదాయానికి విరుద్ధంగా ఓ తెలుగు నటి తన పెంపుడు కుక్కకు తులాభారం చేయించిందన్న వార్త ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతోంది.టాలీవుడ్‌లో ‘కమిటీ కుర్రోళ్లు’, ‘ది గ్రేట్ ప్రీ–వెడ్డింగ్ షో’ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి టీనా శ్రావ్య ఇటీవల మేడారం జాతరలో తన పెంపుడు కుక్క బరువుకు సమానంగా బెల్లంతో తులాభారం చేయించింది.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమ్మక్క–సారలమ్మ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన సంప్రదాయాలను అవమానించేలా ఈ చర్య ఉందని, పవిత్రమైన జాతరలో ఇలాంటి ఘటనలు జరగడం తగదని భక్తులు మండిపడుతున్నారు.ఈ వివాదం తీవ్రత పెరగడంతో నటి టీనా శ్రావ్య తాజాగా ఓ వీడియో విడుదల చేసి క్షమాపణలు కోరారు. తన పెంపుడు కుక్క కొంతకాలం క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైందని, అది కోలుకుంటే మేడారంలో బెల్లంతో తులాభారం సమర్పిస్తానని తాను మొక్కుకున్నానని ఆమె వివరించారు. ఆ మొక్కు మేరకే కుక్క బరువుకు సమానంగా బెల్లం సమర్పించానని, ఇందులో ఎలాంటి అవమాన ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
అయితే మేడారం జాతర సంప్రదాయాల గురించి, గిరిజనుల ఆచారాల గురించి పూర్తి అవగాహన లేకపోవడం వల్లే ఈ తప్పు జరిగిందని టీనా శ్రావ్య అంగీకరించారు. తన చర్య వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసి బాధపడ్డానని, అందరికీ హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. ఇకపై ఇలాంటి పొరపాట్లు చేయనని, మేడారం వనదేవతల భక్తులను క్షమించమని కోరారు. ప్రస్తుతం ఆమె విడుదల చేసిన క్షమాపణ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఒకవైపు భక్తుల ఆగ్రహం కొనసాగుతుండగా, మరోవైపు కొందరు ఆమె క్షమాపణను స్వీకరించాలని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మేడారం జాతర వంటి పవిత్రమైన గిరిజన పండుగల్లో సంప్రదాయాలు, ఆచారాల పట్ల మరింత జాగ్రత్త అవసరమన్న చర్చ ఈ ఘటనతో మరోసారి తెరపైకి వచ్చింది.
