Akhand 2 | నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్‌లో మాస్ హంగామా ఉంటుంది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ కాంబో బాక్సాఫీస్‌ను కుదిపేసిన విషయం తెలిసిందే. మళ్లీ అదే కాంబోలో మరో పవర్‌ఫుల్ మాస్–డివోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ – ముందురోజే పెయిడ్ ప్రీమియర్స్
బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్‌గా రూపొందిన ‘అఖండ 2: తాండవం’ ఈ నెల 5వ తేదీన పాన్ ఇండియా రేంజ్‌లో వరల్డ్ వైడ్‌గా భారీ స్క్రీన్ కౌంట్‌తో విడుదల కానుంది.ప్రీ రిలీజ్ హైప్‌ను క్యాష్ చేసుకోవడమే కాకుండా, ప్రేక్షకుల్లో ఎమోషనల్ కనెక్ట్ క్రియేట్ చేయడానికే డిసెంబర్ 4 రాత్రి నుంచే పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేసారు. ఈ ప్రీమియర్స్‌కు ఇప్పటికే భారీ డిమాండ్ ఉన్నట్లు ట్రేడ్ టాక్.
బోయపాటి శ్రీను చిన్నకొడుకు వర్షిత్ డెబ్యూ – భక్త ప్రహ్లాదుడిగా కీలక పాత్ర
ఈ చిత్రంలో ఒక ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే దర్శకుడు బోయపాటి శ్రీను చిన్న కుమారుడు వర్షిత్ ఈ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వర్షిత్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసిన బోయపాటి, “నా కొడుకు చేసిన పాత్రకు మీ ఆశీర్వాదాలు కావాలి” అని వినయంగా చెప్పినప్పటికీ, పాత్ర వివరాలను అప్పట్లో రహస్యంగా ఉంచారు.
అయితే తాజాగా ఎక్స్ (Twitter) లో అభిమానులతో చిట్ చాట్ చేసిన బోయపాటి, నా కొడుకు సినిమాలో భక్త ప్రహ్లాదుడి పాత్ర పోషించాడు అని వెల్లడించడం సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ట్రైలర్‌ను మళ్లీ పరిశీలిస్తే నిజంగానే భక్త ప్రహ్లాదుడిగా కనిపిస్తున్న చిన్న క్యారెక్టర్ వర్షిత్‌దేనని ఇప్పుడు నెట్టింట స్క్రీన్ షాట్స్‌తో నిరూపిస్తున్నారు. వర్షిత్ ఎలా నటించాడు? ఎంతవరకు ఇంప్రెస్ చేస్తాడు? అన్నదానిపై అభిమానుల్లో పెద్ద ఆసక్తి నెలకొంది.
సినిమాలో బాలకృష్ణతో పాటు పలువురు ప్రముఖ నటులు నటిస్తున్నారు. హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటించగా, ఆది పినిశెట్టి విలన్‌గా, హర్షాలీ మల్హోత్రా,పూర్ణ, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలో యాక్టింగ్ పరంగా ప్రతి పాత్రకూ బోయపాటి ప్రత్యేకమైన శైలిని జోడించినట్లు తెలిసింది. అఖండ చిత్రంలో తమన్ ఇచ్చిన బీజీఎం ఇప్పటికీ జనాలు రింగ్‌టోన్‌గా పెట్టుకునే స్థాయిలో కల్ట్‌గా మారిపోయింది. అదే పాయింట్‌కు కొనసాగింపుగా అఖండ 2లో తమన్ మరింత గ్రాండ్ స్కోర్ అందించాడని టాక్.ట్రైలర్‌లోనే ఆయన ఇచ్చిన సంగీతం ప్రేక్షకులలో గూస్‌బంప్స్ తెప్పించింది.
