Mahesh Babu | టాలీవుడ్‌లో నటుడిగా సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన మహేష్ బాబు ప్రస్తుతం నటనకే పరిమితం కాకుండా బిజినెస్ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ తో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపర్చేందుకు సిద్ధమవుతున్న మహేష్ బాబు… అదే సమయంలో సినిమా థియేటర్ల బిజినెస్‌లోనూ దూసుకుపోతున్నారు. హైదరాబాద్‌లో ఏషియన్ సినిమాస్‌తో కలిసి ప్రారంభించిన ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లగ్జరీ, టెక్నాలజీ, కంఫర్ట్ అన్నట్టుగా మారిన ఈ థియేటర్… కంటెంట్ ఏదైనా సరే ప్రేక్షకులను ఆకర్షించే స్థాయికి చేరింది. దీంతో హైదరాబాద్‌లోనే నంబర్ వన్ మల్టీప్లెక్స్‌గా పేరు తెచ్చుకుంది.
ఇప్పుడు అదే విజయాన్ని మరింత విస్తరించేందుకు మహేష్ బాబు అడుగులు వేశారు. హైదరాబాద్ తర్వాత బెంగళూరులో కూడా ఏషియన్ భాగస్వామ్యంతో కొత్త మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. “ఏఎంబి లగ్జ్” పేరుతో జనవరి 16న బెంగళూరులో అధికారికంగా తెరుచుకున్న ఈ థియేటర్… దక్షిణ భారతదేశంలోనే తొలి డాల్బీ సినిమా ఎక్స్‌పీరియన్స్ అందించనున్న మల్టీప్లెక్స్‌గా నిలవడం విశేషం. ఈ సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ… “జనవరి 16న బెంగళూరులో ఏఎంబి సినిమాస్ తలుపులు తెరుస్తున్నాయి. సౌత్ ఇండియాలోనే తొలి డాల్బీ సినిమా అనుభూతిని ఇక్కడ అందిస్తున్నాం. ఈ విజయంలో భాగమైన టీమ్ ఏఎంబికి అభినందనలు. త్వరలో బెంగళూరులో కలుస్తాను” అంటూ ట్వీట్ చేశారు.
ఇక మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… ఈ కొత్త మల్టీప్లెక్స్‌లో ప్రదర్శితమైన తొలి సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ కావడం విశేషం. మహేష్ బాబు ప్రారంభించిన బెంగళూరు థియేటర్‌లో చిరంజీవి సినిమాతో తొలి షో పడటం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చకు దారితీసింది.
ఏఎంబి లగ్జ్ ప్రత్యేకతల విషయానికి వస్తే…
500కు పైగా సీటింగ్ సామర్థ్యం, సుమారు 65 అడుగుల భారీ డాల్బీ స్క్రీన్, అత్యాధునిక సౌండ్ సిస్టమ్‌తో దీనిని ప్రపంచ స్థాయి లగ్జరీ థియేటర్‌గా రూపొందించారు. విజువల్స్, సౌండ్, కంఫర్ట్ పరంగా ఇది ఐమాక్స్ థియేటర్లకు ఏమాత్రం తీసిపోదని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే… నటుడిగా, నిర్మాతగా మాత్రమే కాదు, థియేటర్ బిజినెస్‌లోనూ మహేష్ బాబు తన బ్రాండ్ విలువను మరింత పెంచుకుంటున్నారు. త్వరలో ఆయన స్వయంగా బెంగళూరు ఏఎంబి లగ్జ్‌ను సందర్శించనున్నారని సమాచారం. దీంతో అక్కడ కూడా ఏఎంబి క్రేజ్ మరింత పెరగడం ఖాయం అని చెప్పొచ్చు.
