Bangalore | సిలికాన్ సిటీ బెంగళూరు (Bangalore) అరుదైన రికార్డు సృష్టించింది. దేశంలోని నగరాల్లోకెళ్లా బెంగళూరు బెస్ట్ సిటీగా నిలిచింది. గతేడాది మహిళలు మెచ్చిన సేఫెస్ట్ సిటీల్లో బెంగళూరు (best city admired by women in 2025) చోటు దక్కించుకుంది. చెన్నైకి చెందిన వర్క్‌ప్లేస్ ఇంక్లూజన్ సంస్థ అవతార్ (Avtar) నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సంస్థ దేశంలోని 125 నగరాల్లో పలు అంశాలపై సర్వే చేసింది.
ఈ సర్వేలో.. 2025లో భారతదేశంలో మహిళలు నివసించడానికి, పనిచేయడానికి అత్యంత అనుకూలమైన నగరంగా కర్ణాటక రాజధాని బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది. 53.29 సిటీ ఇంక్లూజన్ స్కోర్ (సీఐఎస్)తో టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. ఇక బెంగళూరు తర్వాత 49.86 స్కోర్‌తో చెన్నై రెండో స్థానంలో, పూణే 46.27 స్కోర్‌తో మూడో స్థానంలో, 46.04 స్కోర్‌తో హైదరాబాద్ (Hyderabad) నాలుగో స్థానంలో, 44.49 స్కోర్‌తో ముంబై ఐదో స్థానంలో నిలిచింది. గురుగ్రామ్, కోల్‌కతా, అహ్మదాబాద్, తిరువనంతపురం, కోయంబత్తూర్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
ప్రధానంగా ఈ రెండు అంశాలపైనే..
ప్రధానంగా రెండు అంశాల మీద ఆధారపడి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. మహిళలకు భద్రత, ఆరోగ్యం, విద్య, జీవన సౌలభ్యం వంటి అంశాల ఆధారంగా సోషల్ ఇంక్లూజన్ స్కోర్ (ఎస్‌ఐఎస్), ఉద్యోగ అవకాశాలు, కార్పొరేట్ ఇంక్లూజన్ పద్ధతులు, నైపుణ్యం, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ట్రాక్ చేసే ఇండస్ట్రియల్ ఇంక్లూజన్ స్కోర్ (ఐఐఎస్) ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు.
ఇందులో బలమైన భద్రతా వ్యవస్థలు, ప్రజా సేవలు, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి సామాజిక అంశాల ఆధారంగా మహిళకు నచ్చిన అగ్ర నగరంగా చెన్నై నిలిచింది. పారిశ్రామిక పురోగతి, ఉద్యోగం, జీవన సౌలభ్యం, దీర్ఘకాలిక కెరీర్ వృద్ధికి అత్యంత స్థిరమైన నగరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. మహిళల సామాజిక, పారిశ్రామిక సూచికల్లో సమతుల్యంగా పూణే, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. స్థిరమైన మహిళా శ్రామిక, శక్తి భాగస్వామ్యానికి బలమైన అవకాశాలను ఈ నగరాలు సూచిస్తున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి :
Music Lollipop | మ్యూజిల్ లాలీపాప్.. తింటుంటే సంగీతం వస్తుందంట..!
Director Maruthi | అడ్డంగా దొరికిన మారుతి.. అడ్రెస్ చెప్పి ఎంత పని చేశాడు..!
