MSG Trailer | మెగాస్టార్ చిరంజీవి హీరోగా, హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేశ్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి నెలకొంది.
సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి తనదైన స్టైల్లో స్టార్ట్ చేశారు. మొదటి నుంచే సోషల్ మీడియాలో విభిన్నమైన, ఫన్‌తో కూడిన ప్రమోషనల్ వీడియోలను విడుదల చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
ఆదివారం సాయంత్రం తిరుపతిలోని ఎస్వీ సినీప్లెక్స్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను చిత్రయూనిట్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని సినిమా విజయానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వింటేజ్ చిరంజీవి కామెడీ టైమింగ్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, అనిల్ రావిపూడి మార్క్ హ్యూమర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
ట్రైలర్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, మెగాస్టార్ ఎనర్జీ అన్నీ సమపాళ్లలో కనిపించడంతో ఇది పూర్తి స్థాయి సంక్రాంతి ఎంటర్టైనర్ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నయనతార పాత్రకు మంచి వెయిటేజ్ ఉండటంతో పాటు, వెంకటేశ్ అతిథి పాత్ర ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీ కూడా ట్రైలర్‌తో మరింత పెరిగింది.
ఇక ట్రైలర్ రిలీజ్‌తో ప్రమోషన్స్‌ను మరింత దూకుడుగా నిర్వహించేందుకు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు. సోమవారం నుంచి వరుసగా ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయి. జనవరి 5న నెల్లూరులో సెలబ్రేషన్స్‌తో ప్రారంభమయ్యే ఈ ప్రచార యాత్ర 6న విశాఖపట్నం, 7న హైదరాబాద్, 8న తాడేపల్లిగూడెం, 9న అనంతపూర్, 10న వరంగల్, 11న బెంగళూరు వరకు కొనసాగనుంది.
మొత్తానికి ట్రైలర్‌తోనే మెగా ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణం మొదలైందని చెప్పొచ్చు. సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సిద్ధమైందని ట్రైలర్ స్పష్టంగా చెప్పేసింది. ఇప్పుడు సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
