Smriti -Palash | టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన , మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. నవంబర్ 23న మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగాల్సిన ఈ పెళ్లి, స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అస్వస్థత కారణంగా వాయిదా పడింది. గుండెపోటు లక్షణాలు కనిపించడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్మృతి నిర్ణయం అనుకున్నారు, కానీ ..
స్మృతి మంధాన తన తండ్రి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వివాహాన్ని వాయిదా వేసిందని మొదట ప్రచారం జరిగింది. అంతేకాక, ఆమె సోషల్ మీడియాలో పెళ్లి సంబంధిత పోస్టులను తొలగించడంతో అనేక ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే ఈ నిర్ణయం స్మృతి తీసుకున్నది కాదని, అసలు విషయం పూర్తిగా భిన్నమని పలాష్ ముచ్చల్ తల్లి అమితా ముచ్చల్ తాజాగా ఒక జాతీయ వార్తా చానెల్‌కి వెల్లడించారు.
అమితా ముచ్చల్ చెప్పిన ప్రకారం పలాష్‌కు ఆమె తండ్రితో మంచి సాన్నిహిత్యం ఉందట. శ్రీనివాస్ మంధాన అస్వస్థతకు గురయ్యారన్న వార్త వినగానే…పలాష్‌నే మొదట పెళ్లిని వాయిదా వేయాలని చెప్పాడని ఆమె పేర్కొన్నారు. ఈ సంఘటన పలాష్‌ను తీవ్రంగా కుదిపేసిందని తల్లి వెల్లడించారు. పెళ్లి వాయిదా పడినందుకు పలాష్ తీవ్రంగా భావోద్వేగానికి లోనై గట్టిగా ఏడ్చాడట. దాంతో అతని ఆరోగ్యంలో మార్పు రావడంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందట.
పుకార్లు పుట్టించకండి..
ఐవీ డ్రిప్, ఈసీజీ, మరికొన్ని పరీక్షలు చేశారు.నాలుగు గంటల తరువాత ఆయన పరిస్థితి స్థిరంగా మారిందని తెలిపారు. ప్రస్తుతం పలాష్ ఆరోగ్యం బాగానే ఉన్నా, ఇంకా మానసిక ఒత్తిడిలోనే ఉన్నాడట. పలాక్ ముచ్చల్ కూడా అన్నతో పాటు ముంబై ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటోంది.అన్నీ సద్దుమణిగిన తర్వాతే పెళ్లి అని అమితా ముచ్చల్ పేర్కొంది. స్మృతి తండ్రి పూర్తిగా కోలుకున్న తర్వాతే మా కొడుకు పెళ్లి జరుగుతుందని అన్నాడు. ఇరు కుటుంబాలకూ ఇది చాలా సున్నితమైన సమయం… పుకార్లు సృష్టించకుండా ప్రైవసీని గౌరవించాలి అని పేర్కొన్నారు. స్మృతి తండ్రి త్వరగా కోలుకోవాలని, పలాష్ ముచ్చల్ ఒత్తిడిని దాటుకుని ఆరోగ్యవంతుడిగా మారాలని అభిమానులు కోరుకుంటున్నారు. పెళ్లి తేదీపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
