Renu Desai | మూగజీవాల కోసం పోరాటం.. నాకు ఎవ‌రు లేరంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్

Renu Desai | టాలీవుడ్ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ చేసిన తాజా సోషల్ మీడియా పోస్టు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తోంది. మూగజీవాల హక్కుల కోసం నిరంతరం గొంతెత్తుతున్న రేణు, ఇటీవల వీధి కుక్కలను చంపే ఘటనలపై తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు, ప్రశ్నలు అప్పట్లోనే తీవ్ర దుమారం రేపాయి.

Renu Desai | టాలీవుడ్ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ చేసిన తాజా సోషల్ మీడియా పోస్టు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తోంది. మూగజీవాల హక్కుల కోసం నిరంతరం గొంతెత్తుతున్న రేణు, ఇటీవల వీధి కుక్కలను చంపే ఘటనలపై తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు, ప్రశ్నలు అప్పట్లోనే తీవ్ర దుమారం రేపాయి. కుక్కలతో పాటు ఇతర మూగజీవాలవి కూడా ప్రాణాలే కాదా? అని ఆమె ప్రశ్నించారు. మనుషులతో పాటు అన్ని జీవులకు జీవించే హక్కు ఉందని స్పష్టం చేశారు. కేవలం వీధి కుక్క కాటుతో మనిషి చనిపోతేనే అంతటి ఆగ్రహం ఎందుకు? రోజూ రోడ్డు ప్రమాదాల్లో, హత్యల్లో, అత్యాచారాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి విషయంలో ఎందుకు అంత స్థాయిలో స్పందించడం లేదని ఆమె ఘాటుగా నిలదీశారు.

తనకు తెలిసిన ఒక చిన్నారి డెంగ్యూతో మరణించిన ఘటనను గుర్తు చేస్తూ, దోమల వల్ల మరణాలు జరుగుతున్నప్పుడు వాటిపై ఎందుకు ఆందోళన కనిపించడం లేదని ప్రశ్నించారు. అలాగే చిన్నపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నప్పుడు సమాజం ఎందుకు మౌనంగా ఉంటుందని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చిన్నారిని కుక్క చంపితే ఆ కుక్కను వెంటనే చంపేస్తారని, మరి చిన్నారిపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఎందుకు అదే శిక్ష విధించడం లేదని ఆమె ప్రశ్నించారు. ప్రజలు కాలభైరవుడిని పూజిస్తూనే కుక్కలను చంపడం ఎంతవరకు న్యాయమని కూడా ఆమె వ్యాఖ్యానించారు.ఈ ప్రెస్‌మీట్ అనంతరం తనపై కొందరు విమర్శలు, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని రేణు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో గంగా నదిలో పడవలో ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేస్తూ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చారు.

“నన్ను రక్షించడానికి నాకు తండ్రి గానీ, తల్లి గానీ, అన్నయ్య గానీ, భర్త గానీ లేరు. నా తప్పు ఏమీ లేకపోయినా మీరు నాపై కురిపించే ద్వేషాన్ని నేను ప్రశాంతంగా ఆ దేవికి, మహాదేవునికి చెబుతాను. వారు నా బాధను వింటారని, నా కన్నీళ్లను చూస్తారని నాకు తెలుసు” అంటూ ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు. చివరగా “నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్” అంటూ పోస్టును ముగించారు. ఈ పోస్టుతో రేణు దేశాయ్ ఒంటరితనం, ఆమె ఎదుర్కొంటున్న మానసిక వేదన స్పష్టంగా బయటపడింది. అయినప్పటికీ తాను మూగజీవాల హక్కుల కోసం పోరాటం చేయడం ఆపనని, ఎంతమంది విమర్శించినా వెనక్కి తగ్గనని ఆమె మరోసారి స్పష్టం చేశారు.

Latest News