Sreeleela | సినీ నటి శ్రీలీల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పేరుతో సోషల్ మీడియాలో రూపొందుతున్న అభ్యంతరకరమైన, అర్థరహిత కంటెంట్‌పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కంటెంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని ప్రజలను కోరుతూ, ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. కళను వృత్తిగా ఎంచుకున్నా సరే, ప్రతి అమ్మాయి ఒకరి కూతురు, సోదరి లేదా స్నేహితురాలేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
చేతులు జోడించి వేడుకుంటున్నా..
AI టెక్నాలజీని వినియోగించడానికీ, దానిని దుర్వినియోగం చేయడానికీ మధ్య చాలా తేడా ఉందని శ్రీలీల స్పష్టం చేశారు. “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్రియేట్ చేస్తున్న అర్థరహితమైన కంటెంట్‌ను ప్రోత్సహించవద్దని సోషల్ మీడియా వినియోగదారులందరినీ నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. టెక్నాలజీ మన జీవితాలను మెరుగుపరచడానికి ఉండాలి కానీ, ఇలా ఇబ్బందుల్లోకి నెట్టడానికి కాదు” అని ఆమె పేర్కొన్నారు.
వినోదం పేరుతో మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ట్రోలింగ్, మానసిక వేధింపులు ఎంతటి బాధను కలిగిస్తాయో ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది. “కళను వృత్తిగా ఎంచుకున్నా సరే, ప్రతి అమ్మాయి ఒకరి కూతురో, సోదరో లేదా స్నేహితురాలో అన్న విషయాన్ని మర్చిపోవద్దు” అంటూ ఆమె హృదయవేదన వ్యక్తం చేశారు.సినీ పరిశ్రమపై కూడా శ్రీలీల కీలక వ్యాఖ్యలు చేశారు. “మేము ఎంతో ఇష్టపడే ఈ పరిశ్రమలో మాకు రక్షణ ఉంటుందన్న నమ్మకంతో పని చేయాలనుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఈ అసభ్యకరమైన పరిణామాలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. ఇవి చాలా బాధాకరమైనవి” అని తెలిపారు. ఇది తన ఒక్కరి సమస్య కాదని, చాలా మంది నటీమణులు ఇలాంటి వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆమె వెల్లడించారు.
ఇలాంటివి ప్రోత్సహించవద్దు..
తోటి నటీమణుల తరపున కూడా తాను ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానని, అభిమానులు, ప్రేక్షకులు తమకు అండగా నిలబడాలని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారని కూడా శ్రీలీల తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ, ఏఐ టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఉపయోగించాలన్న చర్చకు మరింత బలం చేకూరుస్తున్నాయి.
