Himachal Pradesh : శునకం విశ్వాసం.. గడ్డకట్టే చలిలోనూ యజమాని మృతదేహానికి 4 రోజులపాటూ కాపలాగా.. కన్నీరు తెప్పిస్తున్న దృశ్యం

గడ్డకట్టే చలిలోనూ యజమాని మృతదేహానికి నాలుగు రోజులపాటు కాపలా కాసిన శునకం విశ్వాసం అందరి కళ్లలో కన్నీళ్లు తెప్పిస్తోంది.

Pitbull Guards Owners Body in Chamba

సాటి మనిషికి సాయం చేసినా గుర్తుంచుకోని ఈ రోజుల్లో ఓ శునకం (Pitbull) యజమాని పట్ల విశ్వాసం ప్రదర్శించింది. తీవ్రమైన మంచులో ప్రాణాలు కోల్పోయిన యజమానికి గడ్డకట్టే చలిలోనూ కాపలా కాసింది. ఈ హృదయ విదారక ఘటన హిమాచల్‌ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

కొండ ప్రాంతమైన హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో ప్రస్తుతం భారీగా మంచు కురుస్తోన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా విపరీతంగా మంచు పడుతోంది. ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టే పరిస్థితి లేదు. భారీ హిమపాతం, ఎముకలు కొరికే చలితో అక్కడ ప్రస్తుతం కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. చలి తీవ్రతకు తట్టుకోలేక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, మృతదేహానికి ఓ పెంపుడు శునకం దాదాపు నాలుగు రోజులపాటూ గడ్డకట్టే చలిలోనూ కాపలా కాసింది.

చంబా (Chamba) జిల్లాలోని భర్మౌర్‌ (Bharmaur)లోని భర్మణి ఆలయం సమీపంలో విక్షిత్‌ రాణా, పియూష్‌ అనే ఇద్దరు యువకులు కనిపించకుండా పోయారు. వారు కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య మంచులో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు, స్థానికులు అంచనా వేశారు. ఈ క్రమంలో సమీప ప్రాంతంలో వారి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో వారికి కనిపించిన ఓ దృశ్యం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.

మంచులో కూరుకుపోయిన పియూష్‌ మృతదేహం వద్ద పెంపుడు శునకం కాపలా కాస్తూ కనిపించింది. నాలుగు రోజులపాటూ ఆహారం, నీళ్లు ముట్టకుండా మృతదేహం వద్దకు ఎవరినీ రాకుండా సెక్యూర్‌ చేసింది. అడవి జంతువుల బారి నుంచి తన యజమానిని రక్షించింది. రెస్క్యూ సిబ్బందిని కూడా తొలుత దగ్గరకు రానివ్వలేదు. మృతదేహాన్ని వెలికితీసేందుకు ప్రయత్నించిన రెస్క్యూ టీమ్‌ను కూడా శునకం అడ్డుకుంది. విశ్వాసం ప్రదర్శించింది. ఈ దృష్యాన్ని చూసి అక్కడివారంతా చలించిపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

Indian Railways : రైలు ఆలస్యంతో పరీక్షకు గైర్హాజరు.. విద్యార్థినికి రూ.9 లక్షల పరిహారం
Viral Video : బిగ్ అనకొండ..చూసేయండి వీడియో

Latest News