Sukhvinder Singh Sukhu | జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆయా రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
అయితే తాజాగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖుకు కూడా బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. రిపబ్లిక్ డే రోజున ఆయన ఆత్మాహుతి దాడి చేసి చంపేస్తామని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన సీఎం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ బెదిరింపు మెయిల్ సిమ్లా డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. సిమ్లాలో సీఎం సుఖ్విందర్ సింగ్ జాతీయ జెండాను ఎగురవేస్తే, కచ్చితంగా సూసైడ్ బాంబుతో హతమారుస్తామని హెచ్చరించారు. మెయిల్ పంపిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బెదిరింపుల మెయిల్ నేపథ్యంలో సిమ్లాలో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
