Himachal Pradesh : హిమాచల్‌లో భారీ హిమపాతం.. రోడ్లు మూసివేత.. చిక్కుకుపోయిన పర్యాటకులు

హిమాచల్‌లో భారీ హిమపాతం. 1,250 రోడ్లు మూసివేత.. మనాలిలో చిక్కుకున్న వేలాది మంది పర్యాటకులు. శ్రీనగర్‌లో 50 విమానాలు రద్దు.. ప్రజలకు ఆరెంజ్ అలర్ట్.

Himachal Pradesh

ప్రముఖ కొండ ప్రాంతమైన హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో భారీగా మంచు కురుస్తోంది (Heavy Snow Fall). అక్కడ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఇళ్లు, రహదారులు, వాహనాలు, చెట్లపై భారీగా హిమపాతం పడుతోంది. గడ్డకట్టే చలిలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిరంతరం కురుస్తున్న మంచు కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పుకుపోయాయి. రోడ్లపై భారీగా మంచు పేరుకుపోయింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నీరు, విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

రోడ్లు మూసివేత.. చిక్కుకుపోయిన పర్యాటకులు

రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా హిమపాతం కురుస్తోంది. ఈ మంచు కారణంగా ఎక్కడికక్కడ రహదారులు మూసుకుపోయాయి. రహదారులపై మంచు పేరుకుపోవడంతో 1,250 రోడ్లను అధికారులు మూసివేశారు (Roads Closed ). దీంతో వరుస సెలవులతో కొండ ప్రాంతానికి వెళ్లిన పర్యాటకులు ఎక్కడివారు అక్కడే వాహనాల్లోనే చిక్కుకుపోయారు. మనాలి, కులు తదితర ప్రాంతాల్లో వేలాది మంది పర్యాటకులు చిక్కుకుపోయారు.

వీకెండ్‌లో వరుస సెలవులు వచ్చాయి. శని, ఆది, సోమవారం ఇలా వరుస సెలవులు కావడంతో మంచు అందాలను వీక్షించేందుకు కొండ ప్రాంతానికి పర్యాటకులు పోటెత్తారు. అయితే, విపరీతమైన మంచు కారణంగా రహదారులు మూసివేయడంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు. ఎటూ వెళ్లలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీ హిమపాతం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌, నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. మొబైల్ నెట్‌వర్క్‌కు కూడా అంతరాయం కలిగినట్లు వివరించారు.

అధికారుల హెచ్చరికలు..

నేడు పర్వత ప్రాంతాల్లో భారీగా హిమపాతం సంభవించే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మనాలి, సిమ్లా, మండి, కులు, కిన్నౌర్‌, చంబా, లాహౌల్‌-స్పితి ప్రాంతాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. మరోవైపు తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకూ అనవసర ప్రయాణాలు చేపట్టొద్దని ప్రజలకు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. అంతేకాదు వరుస సెలవులతో మంచు అందాలను ఆస్వాదించేందుకు మనాలీ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన పర్యాటకులు వారు బసచేసే ప్రదేశాల్లోనే ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు చేపట్టొద్దని హెచ్చరించారు.

శ్రీనగర్‌లో విమాన సర్వీసులు రద్దు

మరోవైపు జమ్ము కశ్మీర్‌లోనూ భారీగా మంచు కురుస్తోంది. శ్రీనగర్‌, బారాముల్లా, గుల్మార్గ్‌ సహా ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతోంది. ఈ మంచు కారణంగా స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై భారీగా మంచు పేరుకుపోయింది. ఈ మంచు పరిస్థితులు రోడ్డు, వాయు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో దాదాపు 50 విమాన సర్వీసులు రద్దయ్యాయి. అందులో 25 అరైవల్స్‌ కాగా, 25 డిపార్చర్స్‌ ఉన్నాయి. వాతావరణం అనుకూలించడం లేదని, నిరంతరం మంచు కురుస్తోందని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందన్నారు.

ఇవి కూడా చదవండి :

Ranabaali | విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్ లో ఏఐ ఎక్కువ‌గా వాడారా.. డైరెక్ట‌ర్ క్లారిటీ
Badrinath | బద్రినాథ్‌, కేదార్‌నాథ్‌ ఆలయాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం..!

Latest News