Badrinath | ఉత్తర భారతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్ (Badrinath), కేదార్‌నాథ్ (Kedarnath) ఆలయాలను ఏటా లక్షలాది మంది సందర్శిస్తుంటారు. ఈ ఆలయాలను జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని ఆశపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ తీసుకున్న ఓ నిర్ణయం భక్తులను షాక్‌కు గురి చేస్తోంది.
ఈ రెండు ఆలయాల్లోకి ఇకపై హిందువులను (Hindus) మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని బద్రీనాథ్-కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ ప్రతిపాదించింది. గంగోత్రి, ముక్భా, బద్రినాథ్, కేదార్‌నాథ్ సహా బీకేటీఎస్ ఆధ్వర్యంలోని అన్ని ఆలయాల్లో హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు చేపట్టిన తీర్మానాన్ని ఆదివారం బీకేటీఎస్ ఆలయ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఈ విషయాన్ని కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేదీ తెలిపారు. త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించనున్నది. అయితే, ఈ కొత్త నిబంధనలు ఎప్పటినుంచి అమల్లోకి తెస్తారన్న విషయాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదు. కాగా, ఇప్పటికే గంగోత్రి ధామ్‌లోకి హిందూయేతరులు ప్రవేశించకుండా నిషేధం విధించారు. కమిటీ నిర్ణయాలకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ మద్దతు పలకగా కాంగ్రెస్ తప్పుబట్టింది. మరోవైపు బోర్డు నిర్ణయంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
