Himachal Pradesh : కొండలను చీల్చుకుంటూ వెళ్లిన మంచు ప్రవాహం.. షాకింగ్‌ వీడియో

హిమాచల్ ప్రదేశ్ చంబాలో కొండలను చీల్చుకుంటూ మంచు ప్రవాహం ఏర్పడింది. ప్రమాద హెచ్చరికగా భావిస్తున్న స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. వీడియో వైరల్ అవుతోంది.

Himachal Pradesh

ఉత్తరాది రాష్ట్రాలను మంచు (Snow) ముంచెత్తింది. జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో విపరీతంగా పంచు పడుతోంది. కొండలు, చెట్లు, వాహనాలు, ఇళ్లపై మంచు పేరుకుపోయింది. రహదారులపై మంచు దిబ్బలుగా ఏర్పడింది. దీంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఇళ్ల నుంచి కాలు బయటకు పెట్టే పరిస్థితి లేదు. అక్కడ సరస్సులు, నదులు గడ్డకట్టుకుపోయాయి. మొత్తంగా ఆయా రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది.

ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో భారీగా హిమపాతం పడుతోంది. అక్కడ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. గుల్మార్గ్‌, మనాలి, సిమ్లా, మండి, కులు, కిన్నౌర్‌, చంబా, లాహౌల్‌-స్పితి తదితర ప్రాంతాల్లో మంచు విపరీతంగా పడుతోంది. తాజాగా చంబాలోని మింధాల్‌ గ్రామంలోని ఓ పర్వత ప్రాంతంలో మంచు ప్రవాహం (river of snow) ఏర్పడింది. కొండలను చీల్చుకుంటూ సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ మంచు ప్రవాహాన్ని చూసి స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇది ఎలాంటి ప్రమాదానికి హెచ్చరిక సంకేతమో అని భయాందోళనకు గురవుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. మంచు ప్రవాహానికి సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు రికార్డు స్థాయిలో కురుస్తున్న హిమపాతంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

మనాలీపై మంచు దుప్పటి.. డ్రోన్‌ విజువల్స్‌

ప్రముఖ పర్యాటక ప్రాంతం మనాలీపై మంచు దుప్పటి పరుచుకుంది. ఇళ్లు, రోడ్లు, చెట్లు, ఎత్తైన ప్రదేశాలు మొత్తం శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి. కనుచూపు మేర తెల్లటి తివాచీ పరిచినట్లుగా వాతావరణం ఆహ్లాదంగా కనిపిస్తోంది. కనుచూపుమేర మంచు తప్ప మరేమీ లేదు. ఇందుకు సంబంధించిన డ్రోన్‌ విజువల్స్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

 

ఇవి కూడా చదవండి :

Virat Kohli : కోహ్లీ ఇన్‌స్టా ఖాతా మాయం.. గందరగోళంలో ఫ్యాన్స్‌.. విరాట్‌ ఎక్కడ..? అంటూ అనుష్కకు ప్రశ్నలు
Niagara Falls | వింటర్ వండర్ ల్యాండ్.. గడ్డకట్టిన నయాగరా అందాలు.. వీడియో చూశారా..?

Latest News