- 30వ తేదీ వరకు సమావేశాలు.. 30న ద్రవ్య వినిమయ బిల్లు
Telangana Budget | రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి 20వ తేదీన అసెంబ్లీకి సమర్పించనున్నారు. 30 వరకూ కొనసాగే ఈ సమావేశాల్లో చివరి రోజున ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలి, శాసన సభ సమావేశాల నిర్వహణపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, సీపీఐ, ఎంఐఎం సభ్యులు హాజరయ్యారు. మంగళవారం అసెంబ్లీలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగం పై ధన్యవాద తీర్మానం చేయనున్నారు. బుధవారం (18వ తేదీ) గవర్నర్ ప్రసంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించనున్నారు. 19న ఉగాది సెలవు కాగా, 20న శాసన సభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టనున్నారు. 21వ తేదీని రంజాన్ సెలవు గా ఖరారు చేశారు.
మూడు రోజులు చర్చ.. సీఎం సమాధానం..
22వ తేదీ ఆదివారం, 23వ తేదీ సోమవారంపై బడ్జెట్ పై చర్చించనున్నారు. 24వ తేదీ బడ్జెట్ పై తుది చర్చతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తారు. 25, 26వ తేదీలలో పద్దులు ఆమోదం పై చర్చ జరగనున్నది. 27వ తేదీ శ్రీరామ నవమి కావడంతో సెలవు ప్రకటించి, 28వ తేదీ ఒకరోజు సభ నిర్వహించనుండగా, 29వ తేదీ ఆదివారం సెలవు. ఈనెల 30న ద్రవ్య వినిమయ బిల్లు ను డిప్యూటీ సీఎం సభలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలి, శాసన సభ సమావేశాలు ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభించాలని బీఏసీ లో బీఆర్ఎస్ పక్షం ఉపనేత టీ.హరీశ్ రావు కోరగా, స్పీకర్ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు.
ఢిల్లీకి రేవంత్ రెడ్డి
మంగళవారం మధ్యాహ్నం (17వ తేదీ మంగళవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. అదే రోజు సాయంత్రం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
డిప్యూటీ సీఎం తో బీసీ ఎమ్మెల్యేల భేటీ
శాసన సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్ లో కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు బీ.మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్ లో బీసీ లకు నిధులు కేటాయించాలని కోరారు. బీసీ ల రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందని వారు గుర్తు చేశారు. గత బడ్జెట్ కన్నా ఎక్కువగా నిధులు కేటాయిస్తే, పరిషత్ ఎన్నికల్లో బీసీ ఓటర్లు కాంగ్రెస్ కు పట్టం కడతారని డిప్యూటీ సీఎం కు వివరించారు.
రేవంత్ రెడ్డితో సుబ్రమణియన్ భేటీ
ఆర్ధిక పరిస్థితి మెరుగుపరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రముఖ భారత ఆర్థికవేత్త సుబ్రమణియన్ సూచించారు. శాసన సభలో సీఎం ఛాంబర్ లో రేవంత్ రెడ్డి తో సుబ్రమణియన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు పలు కీలక సూచనలు చేశారు. విద్యుత్ రంగం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, జీఎస్టీ అంశాలపై సుబ్రమణియన్ తో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చర్చించారు. విద్యుత్ రంగంలో ఖర్చుల నమూనా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగంలో నమూనా మూల్యాంకనం, జీఎస్టీలో పన్నుల అంచనా, ఇతర అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పన్నుల కమిషనర్ రఘునందన్ రావు పాల్గొన్నారు.
