• Telugu News
  • /Latest news

Revanth Reddy| దళితులకు నాయకత్వ సామర్ధ్యం లేదని చూపేందుకు బీఆర్ఎస్ రచ్చ: సీఎం రేవంత్ రెడ్డి

మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ పేరుతో బీఆర్ఎస్ శాసన సభలో చేస్తున్న రచ్చ వెనుక దళితులకు నాయకత్వ సామర్ధ్యం లేదని చూపించే కుట్ర దాగి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెడిన కోతి వనమల్లా చెరిచిందన్నట్లుగా కేసీఆర్ సభకు రాకుండా.. హరీశ్ రావు, కేటీఆర్ వంటి వారితో సభలో అల్లరి చేయిస్తున్నాడని మండిపడ్డారు.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Mar 29, 2026, 1:34 pm IST
Read Time: 3 mins
Revanth Reddy| దళితులకు నాయకత్వ సామర్ధ్యం లేదని చూపేందుకు బీఆర్ఎస్ రచ్చ: సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ పేరుతో బీఆర్ఎస్ శాసన సభలో చేస్తున్న రచ్చ వెనుక దళితులకు నాయకత్వ సామర్ధ్యం లేదని చూపించే కుట్ర దాగి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెడిన కోతి వనమల్లా చెరిచిందన్నట్లుగా కేసీఆర్ సభకు రాకుండా.. హరీశ్ రావు, కేటీఆర్ వంటి వారితో సభలో అల్లరి చేయిస్తున్నాడని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి రాజీనామాకు డిమాండ్ చేయడానికి ముందు మీరంతా పదేళ్లలో చేసిన అవినీతి, అక్రమాలకు ఎన్ని సార్లు రాజీనామా చేయాలో గుర్తు చేసుకోవాలన్ని ఎద్దేవా చేశారు.

శాసన సభలో బీఆర్ఎస్ రచ్చ వెనుక దళితుడైన స్పీకర్ సభను నడపలేడని, దళితుడైన ఆర్థిక మంత్రి భట్టికి బడ్జెట్ పెట్టే సామర్ధ్యం లేదని, దళితుడైన మైనింగ్ మంత్రి ఆ శాఖను నడపలేకపోతున్నాడని చాటి చెప్పే కుట్ర దాగి ఉందని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు బీఆర్ఎస్ నాయకత్వం మొదటి నుంచి వ్యతిరేకం అని ఆరోపించారు. అందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన పదవులు, కాంగ్రెస్ ఆ వర్గాలకు కల్పించిన పదవుల వివరాలను రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

అవినీతి మచ్చలేని నాయకుడు కడియం

అవినీతి మచ్చలేని సీనియర్ నాయకుడైన కడియం శ్రీహరి పట్ల బీఆర్ఎస్ సభ్యులు ప్రదర్శించిన వైఖరి అనుచితమైందని, కడియం పట్ల పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు ఎంతమాత్రం అంగీకరించేది కాదని, ఈ వైఖరి కొనసాగితే భవిష్యత్తులో సభలో కుస్తీ పోటీలు చూడాల్సి వస్తుందన్నారు. సభకు సహకరించకపోతే పాడి కౌశిక్ రెడ్డి సహా, బీఆర్ఎస్ సభ్యులందరిపై సభా నియమాలను అనుసరించి చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు సూచించారు.