‘మనం వెళ్లాల్సిన రైలు జీవితకాలం ఆలస్యం’ (train delay) అనే మాటను భారతీయ రైల్వే (Indian Railways) దశాబ్ధాల నుంచి నిజం చేసి చూపిస్తున్నది. ఆధునిక సాంకేతికత, ఆన్‌లైన్ సర్వీసులు అందుబాటులోకి వచ్చినా ప్రపంచంలో అతిపెద్దదైన మన రైల్వే వ్యవస్థ ప్రయాణికులను సకాలంలో గమ్యస్థానానికి చేర్చడంలో ఇప్పటికీ ఘోరంగా విఫలమవుతున్నది. దేశంలోని మొత్తం ప్రయాణికుల రైళ్లలో నిత్యం సగటున 24%కిపైగా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయని, టైంటేబుల్ ప్రకారం గమ్యస్థానాలకు చేరడం లేదని స్వయంగా రైల్వేశాఖే అనేకసార్లు అంగీకరించింది.
ఇక రైళ్ల ఆలస్యం కారణంగా నష్టపోయిన ప్రయాణికులు వినియోగదారుల హక్కుల ఫోరం ద్వారా నష్టపరిహారాన్ని కూడా పొందిన ఘటనలు మనం అనేకం చూశాం. తాజాగా రైలు ఆలస్యంతో ఓ విద్యార్థి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిన కేసులో న్యాయస్థానం తాజాగా కీలక తీర్పు వెలువరించింది. రైలు ఆలస్యంగా రావడం వల్ల పరీక్ష రాయలేకపోయిన ఓ విద్యార్థినికి రైల్వే శాఖ నుంచి రూ.9 లక్షల పరిహారం చెల్లించాలని వినియోగదారుల ఫోరమ్ భారతీయ రైల్వేను ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బస్తీ (Basti) జిల్లాకు చెందిన సమృద్ధి (Samruddhi) అనే విద్యార్థిని 2018లో బీఎస్సీ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంది. పరీక్షకు లక్నోలోని జై నారాయణ్ పీజీ కళాశాల సెంటర్ పడింది. దీంతో పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఆమె ‘ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్’ రైలు ఎక్కింది. కానీ, ఆ రైలు నిర్ణీత సమయం కంటే రెండున్నర గంటలు ఆలస్యంగా చేరుకుంది. దీంతో సమృద్ధి టైమ్‌కి పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయింది. ఫలితంగా ఆమె ఓ అకాడమిక్ ఇయర్‌ను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థిని రైల్వే శాఖపై న్యాయపోరాటానికి దిగింది. జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది.
‘ఏడాదిగా ఎంతో కష్టపడి పరీక్షకు సిద్ధమయ్యాను. రైల్వే శాఖ నిర్లక్ష్యం నా భవిష్యత్తును దెబ్బతీసింది’ అంటూ ఆమె ఫిర్యాదు చేసింది. రూ.20 లక్షల నష్టపరిహారం (compensation) చెల్లించాలని తన న్యాయవాది ద్వారా పిటిషన్ దాఖలు చేసింది. అప్పటి నుంచి ఆమె పోరాటం సాగుతూనే ఉంది. ఏడు సంవత్సరాలుగా జరిగిన న్యాయ పోరాటం తర్వాత.. కమిషన్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ లోపాలకు రైల్వే శాఖే బాధ్యత వహించాలని తీర్పు చెప్పింది. విద్యార్థిని కోల్పోయిన విద్యా సంవత్సరానికి గానూ పరిహారంగా రూ.9 లక్షలు, కేసు ఖర్చుల నిమిత్తం రూ.12 వేలు చెల్లించాలని రైల్వే శాఖను వినియోగదారుల కోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లో చెల్లించాలని స్పస్టం చేసింది.
ఇవి కూడా చదవండి :
Horoscope | మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆదాయానికి మించిన ఖర్చులు..!
HYD to BNG – NH-44 | రూపుమారిన హైదరాబాద్-బెంగళూరు హైవే – గ్రీన్‌ఫీల్డ్ నుండి యాక్సెస్ కంట్రోల్డ్ : 5 గంటలే ప్రయాణం
