Kavitha : డిండి ఎత్తిపోతల నిర్వాసితులకు అండగా పోరాడుతా

డిండి లిఫ్ట్ నిర్వాసితులకు పరిహారం, పునరావాసం వరకు కవిత వారి వెంట నిలబడతానని హామీ. ప్రాజెక్ట్ ఆలస్యం ప్రజలకు నష్టం.

Kalvakuntla Kavitha supports Dindi lift irrigation project oustees

విధాత, : డిండి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని కిష్టరాయినిపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహార, పునరావాస పథకాలు అందేవరకు వారికి అండగా ఉండి పోరాడుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. మంగళవారం జనం బాట కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా కిష్టరాయినిపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్ల నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా బాధితులు
తమ గోడు చెప్పుకుంటూ కన్నీళ్ల పర్యమంతమయ్యారు. వారిని ఓదార్చిన కవిత తప్పకుండా అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. డిండి లిప్ట్ ఇరిగేషన్ పూర్తైతే వేలాది మందికి లాభం జరుగుతుందన్న ఆశతో ప్రాంతం చుట్టు పక్కల ప్రజలు, రైతులు పెద్ద మనసు చేసుకొని తమ భూములు ఇచ్చారని గుర్తు చేశారు. 2015 లోనే తొందరగా ప్రాజెక్ట్ పూర్తై ఉంటే సమస్యలు ఉండకపోయేవని, దాదాపు 11 ఏళ్లు ఆలస్యమైందని, దీంతో అప్పుడు 18 ఏళ్లు నిండని చాలా మందికి ఇప్పుడు 18 ఏళ్లు దాటాయని పేర్కొన్నారు. వారికి కూడా పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. అప్పుడున్న ధరలకు ఇప్పుడున్న ధరలకు చాలా తేడా ఉందని, అంతే కాకుండా నిర్వాసితులకు ఇళ్లు గానీ వేరే కాలనీలు గానీ కట్టించలేదు అని తెలిపారు. ప్రజలను వారికి కట్టించిన ఇళ్లలో దిగపెట్టే వరకు నెల నెల ఖర్చు ఇవ్వాలని చట్టంలో ఉందన్నారు. ఈ నాలుగు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకే ఇక్కడకు వచ్చానని కవిత చెప్పారు.

నిర్వాసితులకు బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్యాయం చేశాయి

గతంలో మునుగోడు ఎన్నికలు జరిగినప్పుడు ప్రపంచం మొత్తం ఆ ఎన్నిక గురించి మాట్లాడుకుందని, అంత పెద్ద ఎత్తున ఆ ఎన్నికల్లో ఖర్చు చేశారు అని, అప్పుడు మీకు న్యాయం చేస్తానని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట ఇచ్చారు.
ఇప్పుడు మాత్రం అడిగితే పట్టించుకోవటం లేదని మీరే చెబుతున్నారని, ప్రస్తుత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం మీకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారని గుర్తు చేశారు. మిడ్ మానేర్ కు కట్టినప్పుడు కేటీఆర్ నియోజకవర్గంలో, మల్లన్న సాగర్ కట్టిన సమయంలో కేసీఆర్ నియోజకవర్గం ప్రజలకు న్యాయం చేసినట్లు చేస్తానని రాజగోపాల్ రెడ్డి చెప్పారని, ఉదయం సముద్రం, శివన్నగూడెం, కిష్టరాంపల్లి, లక్ష్మణ పురం ప్రజలకు…ఎకరాకు రూ. 25 లక్షలు ఇప్పిస్తానని చెప్పారని, కానీ ఇప్పుడు ఆయన కూడా పట్టించుకోవటం లేదు అని కవిత విమర్శించారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని పదే పదే అడిగి ఒత్తిడి తేవాల్సిన అవసరముందన్నారు. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాననని. మేము రావటం కారణంగా మీకు 2 రూపాయలు లాభమైనా నా జన్మ ధన్యమైనట్లేనన్నారు.

పనుల ఆలస్యంతో నిర్వాసితుల సమస్యలు మరింత జఠిలం

ఇక్కడకు వచ్చాక కాంట్రాక్టర్ తో మాట్లాడితే..4 నెలలుగా వాళ్లకు కూడా ఈ ప్రభుత్వం డబ్బులు ఇవ్వటం లేదంటని… కట్టపోసుడు బంద్ పెట్టినం అని చెబుతున్నాడని కవిత వెల్లడించారు. అంటే ఈ ప్రాజెక్ట్ ఇంకా ఆలస్యమయ్యే పరిస్థితి ఉందని, ఆ లోపల మనం ఇళ్ల జాగాలు సాధించుకోవాల్సిన అవసరముందని, కొంతమంది ఇబ్రహీంపట్నం, మరికొంతమంది చింతపల్లి లో ల్యాండ్ కావాలని అడుగుతున్నారన్నారు. ఈ అంశానికి సంబంధించి ఒక తారీఖు అనుకొని నల్గొండలో లేదంటే హైదరాబాద్ లో మనం ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్దమవుదామని తెలిపారు. పంతం పట్టి అడిగితేనే పనులు అయ్యే పరిస్థితి ఉందని, మొత్తం డిండి పరివాహాక ప్రాంతంలో పనులు ఆగిపోయాయని, చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఆలస్యం చేస్తున్న కొద్దీ నష్టం ఎక్కువ అవుతోందని, ఇది వరకు రైతులుగా ఉన్న వారు కూలీలు అయ్యారని చెబుతుంటే బాధకరంగా ఉందన్నారు. ఇక కూలీలు ఏమైపోయారో తెలియని పరిస్థితి. ఊరంతా వలస పోయారన్నారు. నిర్వాసితుల పట్ల ప్రభుత్వాల తీరు సరిగా లేదని, వారికి న్యాయం చేయాలని, వెంటనే వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాని కవిత తెలిపారు. లేదంటే ఇక్కడ యువతతో కలిసి హైదరాబాద్ లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యాచరణకు దిగుతామని ప్రకటించారు.