Dandruff Home Remedies : ఇంటి చిట్కాలతోనే చుండ్రుకు చెక్‌ పెట్టండి ఇలా..

చుండ్రు, జుట్టు రాలటం సమస్యలు? ఇంటి చిట్కాలతో పెరుగు, నిమ్మ, వేప, మెంతులతో సహజంగా చుండ్రును తగ్గించండి.

Dandruff Home Remedie

జుట్టు ఊడటంతో పాటు చుండ్రు (Dandruff) వేధింపులు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రస్తుతం ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. డాండ్రఫ్‌కు అనేక కారణాలు ఉంటాయి. గాలి కాలుష్యం, కలుషిత నీటితో త‌ల‌స్నానం చేయ‌డం, షాంపూల‌ను అతిగా వాడడం, ఒత్తిడి, ఆందోళ‌న‌, థైరాయిడ్ స‌మ‌స్యలు, మెడిసిన్లను వాడ‌డం, హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులు వంటి అనేక కార‌ణాల వల్ల చుండ్రు వస్తుంది.

అంతేకాదు మనం తినే ఆహారం కూడా చుండ్రు సమస్యకు కారణమే. ఫలితంగా, జుట్టు నిర్జీవంగా మారిపోయి రాలిపోతుంటుంది. దీని నుంచి ఉపశమనం కోసం మార్కెట్‌లో దొరికే ఎన్నో షాంపూలు వాడుతుంటాం. కొందరైతే ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకుంటున్నారు. అయినా ఫలితం లేదు. ఇంటి చిట్కాలతోనే (home remedies) ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

* చుండ్రు సమస్యను తగ్గించడంలో పెరుగు, నిమ్మరసం కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పుల్లటి పెరుగులో నిమ్మరసం కలిపి జుట్టు అంచుల నుంచి అప్లై చేయాలి. గంట పాటూ ఆరిన తర్వాత ఎలాంటి షాంపూలు వాడకుండా తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

* ఎరుపు రంగు మందారంతోనూ చుండ్రుకు చెక్‌ పెట్టొచ్చు. ఈ పువ్వులు అనేక ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. విట‌మిన్లు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు పోష‌ణ‌ను అందిస్తాయి. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా మారేలా చేస్తాయి. ఎరుపు రంగు మందార పువ్వుల‌ను తీసుకుని శుభ్రంగా క‌డిగి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. అందులో కొద్దిగా పెరుగు వేసి క‌ల‌పాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా ప‌ట్టించాలి. 30 నిమిషాలు అయ్యాక త‌ల‌స్నానం చేయాలి. ఈ చిట్కాల‌ను వారంలో 2 సార్లు పాటిస్తుంటే శిరోజాల‌కు తేమ ల‌భిస్తుంది. శిరోజాలు పొడిబారిపోవ‌డం త‌గ్గిపోతుంది. వెంట్రుక‌లు చిట్లిపోకుండా దృఢంగా ఉంటాయి. అలాగే చుండ్రును కూడా స‌మ‌ర్థవంతంగా త‌గ్గిస్తాయి.

* మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు. మొలకెత్తిన మెంతులను ఆహారంలో భాగం చేసుకుంటే గ్యాస్‌ సమస్యలు ఉండవని న్యూట్రిషనిస్ట్‌లు చెబుతుంటారు. శరీరానికే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా మెంతులు ఎంతో మేలు చేస్తాయి. అందుకే కొన్ని రకాల హెయిర్‌ ప్యాక్స్‌లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. మెంతులను నానబెట్టి పేస్ట్‌లా చేసి అందులో కొంచెం కొబ్బరి నూనె, పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించుకోవాలి. అరగంట నుంచి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేసినా మంచి ఫలితం ఉంటుంది.

* వేపాకు కూడా చుండ్రుకు మందులా పనిచేస్తుంది. వేప ఆకులను మెత్తగా నూరి తలకు పట్టించి పావు గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది. వేపలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగస్‌ గుణాలు చుండ్రును తగ్గించడంలో సాయపడతాయి.

* జుట్టు ఆరోగ్యానికి మనం తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. జుట్టు ఆరోగ్యాన్ని పెంచే ఆరోగ్యకర, సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా ఉండటమే కాదు, చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి :

Indian Railways : రైలు ఆలస్యంతో పరీక్షకు గైర్హాజరు.. విద్యార్థినికి రూ.9 లక్షల పరిహారం
సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట : డిప్యూటీ సీఎం భట్టి

Latest News