MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు( Supreme Court )లో సోమవారం విచారణ జరిగింది. 15 నిమిషాల పాటు వాదనలు జరిగిన అనంతరం.. కవిత పిటిషన్‌పై విచారణను కోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. కవిత పిటిషన్‌పై జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారణ జరిపింది. కవిత తరఫున సినీయర్ న్యాయవాది కపిల్ సిబాల్( Kapil Sibal ) వాదనలు వినిపించారు. వాదనల అనంతరం లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఈడీ( ED ), కవితకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam )లో ఈడీ సమన్లు( ED Notice ) జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
కవితకు జారీ చేసిన సమన్లలో విచారణకు రమ్మని ఈడీ పిలిచిందని కపిల్ సిబల్ పేర్కొన్నారు. కవిత నిందితురాలు కానప్పుడు విచారణకు ఎందుకు పిలుస్తారని ఈడీ తీరుపై సిబల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈడీ కార్యాలయానికి పిలిచే వ్యవహారంలో అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కేసులను ఓసారి పరిశీలించాలి అని సిబల్ సూచించారు.
అనంతరం ఈడీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. విజయ్ మండల్ జడ్జిమెంట్ పీఎంఎల్ఏ కేసుల్లో వర్తించదని, పీఎంఎల్ఏ చట్టం కింద ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం ఈడీకి ఉంటుందని స్పష్టం చేశారు. సెక్షన్ 160 ఈ కేసులో వర్తించదని తెలిపారు.
ఈడీ నోటీసులను రద్దు చేయాలని, మహిళలను ఇంటి వద్దే విచారించాలని, తనకు వ్యతిరేకంగా ఎటువంటి అరెస్టు చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై మార్చి 24వ తేదీన విచారణ జరపాల్సి ఉండగా.. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజుకు విచారణ వాయిదా వేసింది.
కవిత పిటిషన్ విషయంలో ఈడీ అధికారులు సైతం తమ వాదన వినకుండా ఆమె పిటిషన్‌పై విచారణ చేయొద్దని, కీలక ఆదేశాలు జారీ చేయొద్దని ఈడీ కేవియేట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ కోర్టు విచారణ జరిపి, మరో 3 వారాలకు వాయిదా వేసింది.