Site icon vidhaatha

Health tips | కడుపుబ్బరంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ వంటింటి పదార్థంతో చక్కటి పరిష్కారం..!

Health tips : ఈ ఉరుకులు పరుగుల జీవితంలో సమయానికి భోజనం చేయకపోవడం.. ఫాస్ట్‌ఫుడ్స్‌, బిర్యానీలు లాంటి మసాలా ఫుడ్స్‌ తరచూ తీసుకోవడం.. లాంటి కారణాలవల్ల అజీర్తి, గ్యాస్ ట్రబుల్‌, కడుపుబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలతో ప్రాణాపాయం లేకున్నా తీవ్రంగా ఇబ్బంది పెడుతాయి. ఎంత ఇబ్బందిగా ఉంటుందో అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. అయితే ఈ గ్యాస్‌ సమస్యను ఎలాంటి మందులు వాడకుండా వంటింట్లో ఉండే ఒక పదార్థంతో ఈజీగా తగ్గించుకోవచ్చు. మరి ఆ వంటింటి పదార్థం ఏమిటో, దానితో కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

వంటింట్లో లభ్యమయ్యే వాము జీర్ణ సమస్యలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. వాములో ఫైబర్, మినరల్స్, విటమిన్‌లు, యాంటీ ఆక్సిడెంట్స్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచే గ్యాస్ట్రిక్ జ్యూస్‌ల స్రావానికి తోడ్పడుతాయి. అజీర్ణం కారణంగా వచ్చే అన్ని సమస్యలకు వాము చక్కటి పరిష్కారం చూపుతుంది. ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.

అర స్పూన్ వాములో చిటికెడు ఉప్పు కలిపి నమిలి మింగాలి. ఆ తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగాలి. లేదంటే పొయ్యి మీద గిన్నె పెట్టి దానిలో ఒక గ్లాసు నీళ్లు పోసి అర స్పూన్ వాము వేసి మరిగించాలి. ఇలా మరిగించిన ఈ నీటిని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి గోరువెచ్చగా తాగాలి. ఇలా చేయడంవల్ల పొట్టలో ఉన్న గ్యాస్ మొత్తం బయటకు వెళ్లి పొట్ట క్లీన్ చేస్తుంది.

అదేవిధంగా వాములో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దాంతో సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి లాంటివి రాకుండా ఉంటాయి. శరీరంలో రక్త సరఫరా బాగా సాగి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేగాక వాము కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి తరచూ వామును ఏదో ఒక రూపంలో తీసుకునే ప్రయత్నం చేయండి.

Exit mobile version