-
మనసుకు శాంతి.. ఒత్తిడికి బ్రేక్
పోటీ ప్రపంచంలో పరుగులు తీసే మనసుకు స్థిరత్వాన్ని అందించే మంత్రం ధ్యానం. మనసులో కలిగే ఆందోళనలు, టెన్షన్లను తక్కువ చేస్తుంది. శ్వాసపై దృష్టి పెట్టడం వల్ల కార్టిసోల్ లాంటి ఒత్తిడి హార్మోన్లు తగ్గి, ఎమోషనల్ గా స్థిమితత్వం ఏర్పడుతుంది. తద్వారా యాంగ్జయిటీ లాంటివి తగ్గుతాయి.
-
ఏకాగ్రత, జ్ఞాపకశక్తి
ఫోన్లలో నోటిఫికేషన్లు, చేతి వేళ్లపై తిరిగే రీల్స్, ఆపీసూ.. ఇల్లూ.. కెరీర్.. సంపాదనా… రిలేషన్స్.. ఇలా అనేక విషయాల చుట్టూ మన మనసు తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల దేని మీదా ఫోకస్ ఉండదు. ఆలోచనలు ఎక్కువై చాలా సందర్భాల్లో మెదడు ఫాగ్ అయిపోతుంటుంది. ధ్యానం వల్ల ఏకాగ్రత పెరిగి, ఫోకస్డ్ గా పనిచేయగలుగుతాం. మెమొరీ, లెర్నింగ్ స్కిల్స్ పెంచే గ్రే మ్యాటర్ మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడు అలర్ట్ గా, సమర్థవంతంగా ఉండటానికి ధ్యానం తోడ్పడుతుందంటున్నారు అధ్యయనకారులు.
-
ఎమోషనల్ హెల్త్ కోసం..
శరీరం శుభ్రంగా ఉండటానికి స్నానం ఎలా చేస్తామో, మెదడు, మనసును శుభ్రంగా ఉంచుకోవడానికి ధ్యానం అనే స్నానం చేయాలంటారు. అందుకే దీన్ని మెంటల్ హైజీన్ గా వ్యవహరిస్తారు. ధ్యానం ద్వారా నెగటివ్ ఆలోచనలు, ఫీలింగ్స్ పట్ల జాగ్రత్తగా ఉండవచ్చు. కోపం, నిరాశ, అసహనం తగ్గి, సహనం, ఆనందం పెరుగుతాయి. మన సంబంధాలు కూడా బలపడతాయి.
-
శారీరక ఆరోగ్యానికి కూడా…
మన మానసిక ఆలోచనలు, శరీరం రెండూ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. అందుకే మనసు బాగాలేకపోతే శరీర ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. శారీరక అనారోగ్యం మెంటల్ హెల్త్ పైన ప్రభావం చూపిస్తుంది. రోజూ మెడిటేషన్ చేయడం వల్ల రక్తపోటు తగ్గడం, గుండె ఆరోగ్యం మెరుగుపడడం, రోగనిరోధక శక్తి పెరగడం లాంటి మార్పులు గమనించారు సైంటిస్టులు. అంతేకాదు, ధ్యానం దీర్ఘకాలిక నొప్పులను కూడా నియంత్రించగలదు.
-
మనసులో ధ్యానం.. మంచి నిద్ర
అలసట, ఆందోళనల వల్ల చాలామందికి నిద్ర కరువవుతుంది. ఇలాంటి వాళ్లకు ధ్యానం సహజమైన నిద్రను ప్రేరేపించే సాధనం. తీవ్రమైన ఆలోచనలకు అడ్డుకట్ట వేసి, మైండ్ కీ, శరీరానికీ ప్రశాంతతను ఇస్తుంది. మైండ్ ఫుల్ నెస్ మెడిటేషన్ నిద్రలేమికి మంచి పరిష్కారం.
-
వర్తమానంలో జీవించడానికి మైండ్ ఫుల్ నెస్
ధ్యానం కేవలం కూర్చుని కళ్లుమూసుకోవడమే కాదు, తినడం, నడక, మాట్లాడటం.. ఇలా ఏ పని అయినా ధ్యానమే అవుతుంది. మనం ఏ పని చేసినా దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ, ప్రస్తుతంలో ఉండగలిగితే ఇంపల్సివిటీ తగ్గుతుంది. తద్వారా జీవన ప్రమాణాలు పెరుగుతాయి.
ధ్యానం అనేది వాస్తవం నుంచి పారిపోవడం కాదు. వాస్తవాన్ని స్పష్టంగా, ప్రశాంతంగా ఎదుర్కోవడం. రోజుకు కొన్ని నిమిషాల ధ్యానం కూడా మనసు, శరీరం, భావోద్వేగాలపై సానుకూల ప్రభావం చూపిస్తుంది.