Site icon vidhaatha

కమలా పండు.. పోషకాలు మెండు

– విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం

– నోరూరించే సిట్రస్ రసాలు మిళితం

– ఈ సూపర్ పండుతో 7 లాభాలివే..

విధాత: కమలా పండు అందరికీ నచ్చిన, ప్రీతిపాత్రమైన పండు… అందరినీ నోరూరించే పండు. ఈ పండులో మనకు అవసరమైన సిట్రస్ రసాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్లే ఇది చాలా ఆరోగ్యకరమైన శక్తిని మనిషికి అందజేస్తుంది. ఈ పండు ముందు.. మనం తొందరపడి తింటున్న ఫాస్ట్ ఫుడ్స్, ఫ్యాషన్ ఫుడ్స్ ఎందుకూ పనికిరావంటే ఆశ్చర్యపోనక్కరలేదు. మన ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఇటువంటి అనారోగ్యకరమైన రెడీమేడ్ ఫుడ్స్ ని వదులుకొని, కమలాపండును తినటం అలవాటు చేసుకోవాలి. కమలాపండు రుచికి రుచి ఇస్తుంది.. మన శరీరానికి, మన ఆరోగ్యానికి ప్రకృతిపరంగా ఒక మంచి వరంలాగా పనిచేస్తుంది. ఇంకా కమలా పండు తినటంతో కేవలం రుచే కాదు.. పండులోని రసాల వల్ల ఒత్తిడి నుంచి మనకు రిలీఫ్ ని ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆహ్లాదపరుస్తుంది.


అలా కమలాపండు మనకు ఎన్నో విధాలుగా మన ఆరోగ్యానికి, మన క్షేమానికి తన సేవల్ని అందిస్తుంటుంది. అందరి నోళ్ళల్లో నీళ్లూరించే ఈ పండు చూడడానికి చాలా అందంగానూ, ఆకర్షణీయంగాను ఉండి మంచి సువాసన కలిగి ఉంటుంది. కమలాపండు రసాలలో విటమిన్లు, ఖనిజాలు అంటే మినరల్స్ అంతేకాదు ఇంకా యాంటీ ఆక్సిడెంట్సు.. మరెన్నో పోషకాలు ఈ పండులో ఉన్న సిట్రస్ రసాలలో మిళితమై ఉంటాయి. అవి మన శరీరానికి అవసరమైన కారకాలను అందిస్తుంటాయి. వాస్తవంగా చెప్పాలంటే మనకు శక్తినిచ్చే పోషకాల పుట్టినిల్లు కమలా పండు. అంత గొప్ప ఈ పండుని కాదని, మరో హానికరమైన వాటిని తినే దానికన్నా ఈ పండును తినటం వల్ల మనసుకు శాంతి దొరకటమే కాదు.. దానిలోని పోషకాలు అన్నీ మన సొంతం అవుతాయి.

సూపర్ పండు.. కమలా పండు తింటే వచ్చే

ఏడు లాభాలేంటో చూద్దామా!

1. కమలా పండులో సీ విటమిన్లు ఫుల్ గా ఉంటాయి. సీ విటమిన్ లకు ఇదొక గని. ఈ విటమిన్లు మన శరీరానికి శక్తినిచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తవి. ఇంకా మన శరీరం రోగాల బారిన పడకుండా సీ విటమిన్లు మన రోగ నిరోధక శక్తిని పెంపొందించుతాయి. సీ విటమిన్లు మన శరీరంలోని తెల్ల రక్త కణాలను రెట్టింపు చేస్తాయి. తెల్ల రక్త కణాల వల్లనే మన శరీరం చిన్నచిన్న సంక్రమణ రోగాలకు గురికాకుండా ఉంటుంది. సీ విటమిన్ లలో కొల్లాజిన్ అనే కారకం కూడా ఉంటుంది. ఇది మన చర్మానికి సాగే గుణాన్ని, నునుపుదనాన్ని, మెరుపుని, ఇవ్వటమే కాకుండా మన చర్మాన్ని ఎల్లప్పుడూ కాంతివంతంగా తాజాగా ఉంచుతుంది. గాయాలను మాన్పడంలోనూ కొలాజిన్ దోహదపడుతుంది.

2. కమలా పండ్లు తినడం వల్ల దానిలోని ఫైబర్ మనకు అందుతుంది. ఫైబర్ మన శరీరానికి చాలా ఉపయోగకరమైనది. దీనివల్ల మన జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతుంది. మలబద్ధకం దూరమవుతుంది. ఫైబర్ వల్ల జీర్ణాశయంలోని మనకు మేలు చేసే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇలా మన జీర్ణాశయానికి, జీర్ణ ప్రక్రియకు చాలా అవసరమైన రసాయనాన్ని కమలాపండు అందిస్తుంది.

3. కమలా పండ్లలోని రసాలలో విటమిన్ ఏ కూడా పుష్కలంగానే ఉంటుంది. విటమిన్ ఏ మన కంటి ఆరోగ్యానికి చాలా అవసరమైన విటమిన్. విటమిన్ ఏ వల్లనే మన కంటి చూపు సరైన విధంగా పనిచేస్తుంది. విటమిన్ ఏ లోపం వల్ల అనేకమంది అనేక కంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యలు వయసుతో పాటు పెరుగుతుంటాయి. కంటిలో పొరలు రావడం, కంటి చూపు తగ్గిపోవడం, కనుగుడ్డు పలచగా పల్చబడటం, కంట్లో నల్లటి మచ్చలు రావడం వంటి మొదలగు సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల కంటి సమస్యల నుండి కాపాడుకోవాలంటే మనకు విటమిన్ ఏ మన శరీరంలో పుష్కలంగా ఉండాలి. అది కమలాపండులో మనం పొందవచ్చు.

4. కమలాపండు తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ద్రవాల బ్యాలెన్స్ సమతుల్యం అవుతుంది. కమలాపండులోని విస్తృత రసాలు మన శరీరానికి అవసరమైన నీటిని అందిస్తాయి. ఈనీటి వల్ల మన శరీరం బయట ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా సిద్ధపడుతుంది. కమలా పండులోని ఈ ద్రవాలతో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా ఈ పండులోని రసాల్లో ఇమిడి ఉన్నాయి. ఎలక్ట్రోలైట్స్ వల్ల నాడీ వ్యవస్థ, కండరాల సంకోచ, వ్యాకోచాలు సజావుగా పనిచేస్తాయి. ఎలక్ట్రోలైట్స్ మన శరీరంలో లోపించినప్పుడు శరీరం బలహీనంగాను, నీరసంగానూ ఉంటుంది. అందువల్ల మన శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉండాలంటే ఎలక్ట్రోలైట్స్ అవసరం. వీటివల్ల శరీరంలోని అంతర్భాగాలు సరైన విధంగా తమ విధులు నిర్వహిస్తాయి. కమలా పండులోని ద్రవాలు ఎలక్ట్రోలైట్స్ ఇందుకు అత్యంత దోహదం చేస్తాయి.

5. యాంటీ ఆక్సిడెంట్ల పవర్ హౌస్ కమలాపండులో సంపన్నమైన విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ వాటిల్లో ఫ్లవణాయిడ్స్, కెరొటోనాయిడ్స్ ఉండడం వల్ల శరీరం నష్టపోయిన కణజాలాన్ని ఇవి త్వరగా వృద్ధి చేస్తూ పెంపొందిస్తాయి. అంతేకాకుండా ఇవి వయసుతో వచ్చే రోగాలను, శరీర మార్పులను అడ్డుకుంటూ మన ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తాయి.

6. విటమిన్ సీ అనేది కొలాజిన్ ఉత్పత్తికి తప్పక అవసరమైన కారకం. ఇది కొలాజిన్ కలిగిఉండటం వల్ల మన చర్మం మృదువుగా ఉంటుంది. కొలాజిన్ వల్లనే మన చర్మం ముడతలు రాకుండా యువతరం లాగా చర్మం గట్టితనంతో ఉంటుంది. మనం కమలాపండు తినడంతో ఇవి మన శరీరానికి అంది, చర్మం పండులోని రసాల నుండి రొలాజిన్ తీసుకొని అది తాజాగా ఉండే విధంగా ప్రయత్నిస్తుంది. అదేవిధంగా మనలో వచ్చే వయసులోని చర్మం ముడతలు సమస్యలు, ఒత్తిడిలను కొలాజిన్ నివారిస్తుంది.

7. కమలాపండు తినడం ద్వారా కమలాపండులోని రసాలు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని మనకు ఎదురయ్యే కొన్ని రకాల క్యాన్సర్ల నుండి కాపాడుతాయి. మన శరీరంలో పనికిరాని కణజాలం కణాలు కొన్ని క్యాన్సర్ కారకాల అవుతాయి. అటువంటి కణజాలాన్ని ఎదుర్కోవడంలో కమలాపండులోని మూలకాలు, పోషకాలు, ఆంటీ యాసిడ్స్ సహాయపడతాయి. ఇన్ని ఉపయోగాలతో కూడుకున్న కమలా పండును మనo తినడం ద్వారానే ఆ ఉపయోగాలను వినియోగించుకొని మన శరీరం, మన ఆరోగ్యం కాపాడబడుతుంది.

Exit mobile version