Site icon vidhaatha

పెరిగిన చలి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

విధాత‌: వాతావరణం చల్ల బడింది. చలి పంజా విసురుతోంది. చలి కాలం అంటేనే వ్యాధులు ప్రభలే కాలంగా చెప్పుకోవచ్చు. ఆస్తమా, సైనసైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారి పాలిట చలి కాలం ఒక శాపమే. ఎప్పుడూ అనారోగ్యం వేధిస్తూనే ఉంటుంది. సాధారణంగా వేధించే కొన్ని చలి కాల సమస్యల గురించి తెలుసుకుందాం.

తరచూ మూత్ర విసర్జన

చలి కాలంలో కొంచెం ఎక్కువ సార్లే టాయిలెట్ కు నడవాల్సి వస్తుంది. వాతావరణం చల్లగా ఉండడం వల్ల చెమట అసలు రాదు. ఫలితంగా చర్మం ద్వారా కొంతైన శరీరంలో అదనంగా చేరిన నీరు వెళ్ళిపోదు. అందువల్ల కిడ్నీలు కాస్త ఎక్కువ పనిచేసి నీటిని వడకట్టాల్సి వస్తుంది. ఫలితంగా సాధారణంగా కంటే కూడా చలి కాలంలో ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చెయ్యాల్సి వస్తుంది. ఇది ఎక్కువగా వేధించదు కానీ కొంత మందిలో బ్లాడర్ ఓవర్ యాక్టివ్ గా ఉంటుంది. అటువంటి వారిలో రోజు వారీ పనుల్లో కొంత ఇబ్బంది ఏర్పడొచ్చు.

దంత సమస్యలు

ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. చలికాలంలో దంత సమస్యలు పెరుగుతాయి. వాతావరణం చల్లబడడం వల్ల శ్వాసించే గాలి కూడా చల్లగా ఉంటుంది. అందువల్ల దంతాల్లో సెన్సిటివిటీ పెరుగుతుంది. చల్లని వాతావరణం వల్ల దంతాల మీద ఉండే ఎనామిల్ కోటింగ్ కు నష్టం జరుగుతుంది. అసాధారణ రీతిలో ఇది సంకోచ వ్యాకోచాలు జరపడం వల్ల డెంటిన్ బయటకు ఎక్స్పోజ్ అవుతుంది. అందువల్ల దంతక్షయం జరుగుతుంది. ఫలితంగా పిప్పిపళ్లు ఏర్పడుతాయి. అంతేకాదు చలి వల్ల వణుకు వస్తుంది. ఆ సమయంలో దంతాల మధ్య రాపిడి జరిగి దంతాలకు నష్టంజరుగుతుంది.

ఇమ్యూనిటీ తగ్గుతుంది

శరీర ఉష్ణోగ్రతను సమతులం చెయ్యడానికి ఎక్కువ శక్తి వినియోగం జరుగుతుంది. అందువల్ల నిరోధక వ్యవస్థ కొంత బలహీన పడుతుంది. అందువల్ల ఈ సీజన్ లో త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. న్యూమోనియా వంటి ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకాలుగా మారుతాయి. జలుబు, దగ్గు వంటివి చాలా సర్వసాధారణంగా ఉంటాయి.

గుండె జబ్బులు

చల్లని వాతావరణ పరిస్థితుల్లో తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం వల్ల ఊపిరితిత్తులు కూడా బలహీన పడతాయి. శరీర ఉష్ణోగ్రతను సంతులన పరచడంలో భాగంగా రక్తనాళాలు కొద్దిగా కుంచించుకు పోతాయి. కనుక ఇప్పటికే చిన్న చిన్న బ్లాక్స్ ఉన్న వారు సులభంగా హార్ట్ ఎటాక్ బారిన పడతారు. ఇది ప్రాణాంతకం కావచ్చు.

డీహైడ్రేషన్ అవుతుందేమో

చలి కాలంలో పొడి గాలి వల్ల నోరు త్వరగా ఎండిపోయిన ఫీలింగ్ వస్తుంది. లాలాజలం కూడా తక్కువగా తయారవుతుంది. నోటిలో ఉండే సహజమైన బ్యాక్టీరియాతో పోరాడే శక్తి సన్నగిల్లుతుంది. దంతక్షయానికి ఇది కూడా ఒక కారణం. అదీ కాక నీళ్లు తాగాలనే కోరిక కూడా తగ్గుతుంది. కనుక నీళ్లు తగినన్ని తీసుకోవడంలో అశ్రద్ద చేస్తారు. ఇది శరీరం డీహైడ్రేట్ కావడానికి కారణం అవుతుంది. ఎలాంటి వాతావరణంలో అయినా సరే రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లు తప్పని సరిగా తాగాలి.

అంగ పరిమాణం

వాతావరణం చల్లగా ఉండడం వల్ల పురుషాంగం చుట్టూ ఉండే రక్తనాళాలు కూడా కొంత కుంచించుకు పోతాయి. ఫలితంగా రక్త ప్రసరణ కూడా కాస్త నెమ్మదిస్తుంది. అందువల్ల అంగ పరిమాణం కూడా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. వృషణాలు కూడా స్క్రోటమ్ వరకు లోపలికి ముడుచుకుని చిన్నవిగా కనిపించవచ్చు. తిరిగి వాతావరణం వేడెక్కినపుడు ఈ అవయవాలు యథా స్థితికి వస్తాయి. ఇది పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం కాదని గమనించాలి.

Exit mobile version