Menstruation | అమ్మాయి.. యుక్త వయసులోకి వచ్చిందనడానికి పెద్ద మనిషే ఉదాహరణ. ఇక్కడ్నుంచే అమ్మాయిల్లో రుతుక్రమం మొదలవుతుంది. అంటే నెలసరి ప్రారంభమవుతుంది. ఈ పెద్ద మనిషి కావడాన్ని రజస్వల, పుష్పవతి అని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే అమ్మాయిలు పెద్ద మనిషి అయిపోతున్నారు. ఒక పది, పదిహేను ఏండ్ల క్రితం పరిస్థితులను పరిశీలిస్తే.. అమ్మాయిలకు 15 ఏండ్ల వయసు వచ్చాకనే పెద్ద మనిషి అయ్యేవారు. ప్రస్తుతం పదేండ్లకే, ఆలోపే పుష్పవతి అవుతున్నారు. ఈ మొదటి పీరియడ్స్‌ను పదేండ్ల లోపే పొందడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుందాం.
కారణాలు ఇవే..
ప్రధానంగా అధిక బరువు, ఊబకాయం, శారీరక శ్రమ తక్కువగా ఉండటం. ఇవన్నీ చిన్న వయసులోనే మొదటి పీరియడ్స్ రావడానికి కారణమవుతున్నాయి. అంతేకాకుండా పరిసర ప్రాంతాలు కూడా కారణమవుతున్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. విషపూరితమైన, కాలుష్యం అధికంగా ఉండే గాలిని పీల్చుకోవడం బాలికలపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తున్నాయట. ఇవే కాకుండా పర్యావరణ కారణాలు, ఒత్తిడి, కొన్ని రకాల రసాయనాలు, లైంగిక హార్మోన్లు ప్రేరేపించే విషయాలు కూడా అమ్మాయిల్లో త్వరగా పెద్ద మనిషి కావడానికి కారణమవుతున్నాయని పరిశోధకులు నిర్ధారించారు. అయితే ఈ కారణాలన్నీ కేవలం పుష్పవతిపైనే కాకుండా, వారిలో లైంగిక కోరికలు పెరగడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నాయట.
ప్రమాదాలు..
యుక్త వయసు కంటే ముందుగానే పీరియడ్స్ మొదలైతే.. అనేక అనారోగ్య సమస్యలు సంభవించే ప్రమాదం ఉంది. గుండె సంబంధిత వ్యాధులు, జీవక్రియలో సమస్యలు, లైంగిక సమస్యలు వచ్చే చాన్స్ ఉంటుంది. సంతానోత్పత్తి కూడా తక్కువగా ఉండడం వల్ల గర్భధారణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. మానసిక సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది.