Postpartum Depression |
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రసవానంతర సమస్యలతో మహిళలు ఎంత ఇబ్బంది పడతారో తెలిసిందే. శారీరక సమస్యలు కొన్నైతే.. మానసిక ఒత్తిడితో వచ్చే ఇబ్బందులు మరికొన్ని. దీనినే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (పీపీడీ) అని వ్యవహరిస్తారు.
ఈ ఒత్తిడితో బాధపడే మహిళలు .. ఎప్పుడూ విచారంగా ఉంటారు. ఆత్మన్యూనతా భావంతో ఉంటూ తమకు విలువ లేదని బాధపడుతుంటారు. కొన్ని సార్లు తనకు తానే హాని చేసుకోవడం, శిశువును కూడా గాయపరచడం వంటి స్థితికి వెళతారు. దీనికి ఇప్పటి వరకు సరైన చికిత్స లేదు.
తాజాగా ఈ ప్రసవానంతర ఒత్తిడి (Post Partum Depression)కి చిన్న ట్యాబ్లెట్ (Pill) చెక్ పెట్టొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. జుర్‌జువావే అనే ఈ పిల్ అన్ని పరీక్షలను దాటుకుని యూఎస్ ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతి కూడా పొందింది. ఈ ట్యాబ్లెట్‌ను ప్రతి రోజూ సాయంత్రం భోజనంతో పాటు వేసుకోవాలని ఎఫ్‌డీఏ సూచించింది.
14 రోజుల పాటు 40 మి.గ్రా. చొప్పున డోస్ తీసుకుంటే సరిపోతుందని తెలిపింది. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ కారణంగా శిశువు, తల్లి మధ్య సరైన అనుబంధం ఏర్పడదని.. ఇది చాలా తీవ్రమైన సమస్య అని ఎఫ్‌డీఏ డైరెక్టర్ ఆఫ్ సైకియాట్రిక్ డ్రగ్స్ డా. ఫ్రాచియోన్ వెల్లడించారు.
ఇలా పరీక్షించారు..
జుర్‌జువావే సామర్థ్యాన్ని రెండు గ్రూపులపై పరిశోధన చేసి నిర్ధరించామని ఎఫ్‌డీఏ (FDA)తెలిపింది. ఈ పరిశోధనకు పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌తో ఇబ్బంది పడుతున్న వారిని తీసుకున్నారు. ప్రసవం తర్వాత నాలుగు వారాల లోపు ఈ ఇబ్బంది బారిన పడిన వారిని మాత్రమే ఈ పరీక్షలకు అనుమతించారు.
మొదటి గ్రూప్‌లో ఉన్న మహిళలను జుర్‌జువావే ట్యాబ్లెట్‌ను రోజుకు 50 మి.గ్రా. చొప్పున 14 రోజుల పాటు ఇచ్చారు. రెండో గ్రూప్‌లో మహిళలకు జుర్‌జువావే అని చెప్పి.. డమ్మీ ట్యాబ్లెట్‌ను తీసుకోమన్నారు.
పరీక్షల గడువు పూర్తయిన తర్వాత చూస్తే అసలైన ట్యాబ్లెట్ తీసుకున్న మహిళలు పోస్ట్‌పార్టం డిప్రెషన్ నుంచి బయటపడినట్లు గుర్తించారు. చివరి జుర్‌జువావే డోసు వేసుకున్న నాలుగు వారాల వరకు దాని ప్రభావం ఉంటుందని గుర్తించారు.
సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
జుర్‌జువావే ను తీసుకోవడం వల్ల నీరసం, బద్దకం, డయేరియా, జలుబు వచ్చే అవకాశముంది. ఈ ట్యాబ్లెట్ కోర్సు కొనసాగుతున్నపుడు గర్భం దాల్చకుండా సురక్షిత పద్ధతులు పాటించాలని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది.