నొప్పులు మామూలుగా ఉండవు. ఇప్పటివరకు మనకు తెలిసిన నొప్పులు కాకుండా, తెలియని ప్రాంతాల్లో నొప్పులు పుడతాయి. కీళ్లు, వేళ్లు, వేళ్ల ముడుసులు, చెవి అంచులు, ముక్కు కొన.. ఇలా విచిత్రమైన ప్రదేశాల్లో నొప్పులు ఆందోళన కలిగిస్తాయి. వీటితో మనకు పరిచయం ఉండకపోవడం అందుకు కారణం. కానీ అంత ప్రమాదకరమైంది కాదు. ప్రాణాంతకమైందీ కాదు. కానీ జ్వరం, ఒళ్లు, కీళ్లనొప్పులతో తీవ్రంగా బాధిస్తుంది. ఒక్క అడుగేసినా నొప్పితో విలవిలలాడిపోయే స్థితి కూడా ఉంటుంది. అదే చికున్‌గన్యా. ఇప్పుడు ఆ చికున్గన్యాకు తొట్టతొలి వ్యాక్సీన్‌ను ఆస్ట్రేలియా కనుగొన్నది. ఇటీవలే దానికి అమెరికా ఎఫ్డిఏ(FDA) అనుమతి లభించింది.
చికున్‌గన్యా(Chikungunya).. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా చికున్‌గన్యా బాధితులే. ముందుగా వచ్చే జ్వరం(High Fever), తర్వాత మొదలయ్యే నొప్పులు(Severe Pains) చికున్గన్యాను గుర్తించగలిగే లక్షణాలు. రక్త పరీక్షల ద్వారా తెలియాలంటే మొదటివారంలో మామూలుగా చేసే పరీక్ష ఐజీఎం యాంటీబాడీ(IgM Antibody test)తో ఫలితం రాదు. ఆర్టి–పిసిఆర్ (RT-PCR) పరీక్ష చేస్తేనే ఫస్ట్ వీక్‌లో తెలుస్తుంది. పది రోజుల తర్వాత ఐజీఎం యాంటీబాడీ పరీక్ష ద్వారా కూడా బయటపడుతుంది. చికున్‌గన్యా జ్వరం త్వరగానే తగ్గిపోయినా, నొప్పులు మాత్రం కనీసం నెలరోజులు వేధిస్తాయి. ఇంకా కొంతమందిలో నెలల తరబడి కూడా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులలో ఇది ఎక్కువ.
తొలిసారి ఈ జబ్బు 1952లో టాంజానియా(Tanzania)లో బయట పడింది. అక్కడి కిమాకొండే భాషలో చికున్‌గన్యా అంటే ముందుకు వంగించేది అని అర్థం. ఇది ఒకరకమైన వైరస్ వల్ల వస్తుంది. దాన్ని చికున్‌గన్యా వైరస్(CHIKV) అని పిలుస్తారు. ఈడిస్ ఆల్బోపిక్టస్(Aedes albopictus) దోమల ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. చికున్‌గన్యా సోకిన మనిషిని కుట్టిన దోమ మరొకరిని కుట్టినపుడు వారికి చికున్‌గన్యా సోకుతుంది.
చికున్‌గన్యా ఎక్కువ ఉష్ణాగ్రతతో జ్వరం రావడంతో మొదలవుతుంది. తర్వాత తీవ్రమైన కీళ్లు(Joint Pains), కండరాల నొప్పులు(Muscle Pains) మొదలవుతాయి. సాధారణంగా చిన్న కీళ్లు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. ప్రధానంగా చేతులు, మణికట్టు, వేళ్లు, కాళ్లు, మడమలు, మెడ, భుజాల్లో (Hands, Fingers, Ankles, Shoulders, Knees, Neck) నొప్పి ఉంటుంది. ఆ బాధ మామూలుగా ఉండదు. తీవ్ర జ్వరం, నొప్పులతో అడుగు తీసి అడుగు వేయటమే గగనమౌతుంది. కొందరికి చర్మం మీద దద్దుర్లు, దురద(Rash, Itching) కూడా రావొచ్చు. చాలామందిలో నల్లటి మచ్చలు(Black patches on the skin) వస్తాయి. ఇవి ముఖ్యంగా ముక్కు మీద కనిపిస్తుంటాయి. జ్వరం ఒకట్రెండు రోజుల్లో తగ్గుతుంది గానీ నొప్పులు మాత్రం దీర్ఘకాలం(Pains last for prolonged time) కొనసాగుతాయి. గన్యా వైరస్ గల దోమ కుట్టాక కొందరికి రెండు రోజుల్లోనే లక్షణాలు బయటపడొచ్చు. కొందరికి ఓ వారం తర్వాత కనిపించొచ్చు.
చికున్గన్యాకు సింపుల్‌గా చెప్పాలంటే ఏ చికిత్సా(No treatement for CHIKV) లేదు. జ్వరం, నొప్పులు ఉంటాయి కనుక, డోలో 650(Dolo-650) ఒక్కటే మార్గం. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవటం ముఖ్యం. తగినంత నీరు, ద్రవాలు తీసుకోవాలి(To be hydrated). బాగా విశ్రాంతి(Rest) తీసుకోవాలి. నొప్పులు మరీ అంతగా బాధపెడితే డాక్టర్ వేరే మందులు(Pain Killers) ఇచ్చే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తిని తగ్గించే స్టిరాయిడ్ల వంటి మందులేవీ ఇవ్వరు.
గన్యా ప్రాణాంతకం కాదు గానీ చాలాకాలం నొప్పులతో వేధిస్తుంది. ముసలివాళ్లకి, చిన్న పిల్లలకు లక్షణాలు, బాధలు ఎక్కువగా ఉంటాయి. వృద్ధుల్లో కొందరికి ఆరు నెలలు, కొన్ని ఏళ్ల వరకూ నొప్పులు ఉండొచ్చు. ఉదయం లేవగానే కీళ్లు బిగుసుకుపోవటం, కీళ్ల వాపు కనిపిస్తాయి. చికున్‌గన్యా వల్ల తీవ్ర జ్వరంతోనే కీళ్ల నొప్పులు(Joint Pains) మొదలవుతాయి. కాబట్టి వీటిని తేలికగానే గుర్తించొచ్చు.
నొప్పులు తగ్గడానికి ప్రత్యేకంగా ఏం చేయడానికి లేదు. కాపడం పెట్టకూడదు. చాలా సింపుల్ ఎక్సర్సైజులు (Physiotherapy)నెమ్మదిగా చేయొచ్చు. ప్రత్యేకమైన ఆహార నియమాలేవీ అవసరం లేదు. వేళకు భోజనం చేయాలి. సమతులాహారం తినాలి. ద్రవాలు, నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. నొప్పులు తీవ్రంగా ఉంటే పారాసెటమాల్(డోలో) వేసుకుంటే చాలు. చికున్‌గన్యా వచ్చినవారికి జీవితాంతం దీన్ని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి లభిస్తుంది. అందువల్ల ఒకరికి ఒకసారి వస్తే మరోసారి రాదు.
ఇప్పుడే చికున్గన్యాకు టీకాను ప్రవేశపెట్టారు. వాల్నెవా(Valneva) అనే కంపెనీ తయారుచేసిన ఇక్స్చిక్( IXCHIQ) ఇప్పుడు అమెరికాలో అందుబాటులో ఉంది. దీనికి ఫెడరల్ డ్రగ్ ఏజెన్సీ(FDA) అనుమతి కూడా లభించింది. మనదేశంలో భారత్ బయోటెక్(Bharat Biotech) సంస్థ దీనికి టీకా అభివృద్ధి చేయటానికి ఇంకా పరిశోధనలు చేస్తోంది.
నివారణకు దోమలు కుట్టకుండా(Avoid Musquito bytes) చూసుకోవడమే మార్గం. దోమలను తరిమే రిపలెంట్లు, ఓడోమాస్ లాంటి క్రీమ్‌లు వాడాలి. మంచానికి దోమ తెర కట్టాలి. ఈ దోమలు మంచి నీటిలో పెరుగుతాయి కాబట్టి ఇంట్లో నీటిని నిల్వ చేసే పాత్రల మీద మూత పెట్టాలి. పూల కుండీలు, ఎయిర్ కూలర్లు, కొబ్బరి చిప్పల వంటి వాటిల్లో నీరు నిల్వ ఉండనీయొద్దు.
చికున్‌గన్యా వల్ల కొందరికి దిగులు, ఆందోళన(Depression, Anxiety Disorder) వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.