Dalai Lama : 90 ఏళ్ల వ‌య‌సులో రికార్డు.. ద‌లైలామాకు గ్రామీ అవార్డు

90 ఏళ్ల వయసులో గ్రామీ అవార్డు సాధించిన టిబెట్ బౌద్ధ గురువు దలైలామా. ఆధ్యాత్మిక సందేశాలతో రూపొందిన ఆడియో బుక్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు.

Dalai Lama

టిబెట్ బౌద్ధ‌మ‌త గురువు ( Tibetan spiritual leader) ద‌లైలామా (Dalai Lama) 90 ఏళ్ల వ‌య‌సులో రికార్డు క్రియేట్ చేశారు. సంగీత రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డు (Grammy Awards)ను అందుకొని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరం వేదికగా జ‌రుగుతున్న‌ ఈ వేడుకలో బెస్ట్ ఆడియో బుక్, నెరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్‌ విభాగంలో మెడిటేష‌న్ (Meditations: The Reflections of His Holiness the Dalai Lama) అనే ఆల్బ‌మ్‌కు గానూ ఆయనకు గ్రామీ అవార్డు దక్కింది. ఆధ్యాత్మిక సందేశాలు, శాంతి, మానవ విలువలపై ఆయన అందించిన ఆడియో బుక్‌కు ఈ అవార్డు లభించడం విశేషం. 90 ఏళ్ల వ‌య‌సులో ఈ అవార్డును ద‌క్కించుకొని ద‌లైలామా స‌రికొత్త రికార్డును క్రియేట్ చేశారు.

క‌రుణ‌, ఆత్మ శాంతి, భావోద్వేగాల గురించి ద‌లైలామా చేసిన ప్ర‌సంగాల‌కు.. స‌రోద్ వాయిద్య‌కారుడు అంజ‌ద్ అలీ ఖాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అంజ‌ద్ కుమారుడు అమ‌న్ అలీ బంగాష్‌, అయ్య‌న్ అలీ బంగాష్ కూడా మ్యూజిక్ కంపోజ్ చేశారు. ద‌లైలామా ఆల్బ‌మ్ కోసం అంత‌ర్జాతీయ క‌ళాకారులు ఆండ్రా డే, మ్యాగీ రోజ‌ర్స్‌, టోనీ సుకార్‌, టెడ్ నాష్‌, దేబీ నోవా, రూఫ‌స్ వెయిన్‌రైట్ ప‌నిచేశారు. ఈ ఆల్బ‌మ్‌ను గ్రామీ అవార్డు విజేత క‌బీర్ సెహ‌గ‌ల్ ప్రొడ్యూస్ చేశారు. ద‌లైలామాకు ఈ అవార్డు రావ‌డంప‌ట్ల ప‌లువురు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా బౌద్ధ మ‌త గురువుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా, సంగీత రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల (Grammy Awards) ప్రదానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. లాస్‌ ఏంజెల్స్‌ వేదికగా జరుగుతున్న ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గాయనీ గాయకులు, మ్యూజిక్‌ డైరెక్టర్లు హాజరై సందడి చేస్తున్నారు. రెడ్‌ కార్పెట్‌పై నడుస్తూ ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

90 ఏళ్ల ద‌లైలామా..
ఈ బౌద్ధ‌మ‌త గురువుకు 14వ ద‌లైలామాగా ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్ర‌స్తుతం ద‌లైలామాకు 90 ఏళ్లు. తాను మ‌రో 40 ఏళ్ల పాటు జీవించే అవ‌కాశం ఉంద‌ని ద‌లైలామా ఇటీవ‌లే త‌న పుట్టిన‌రోజు వేడుక‌ల్లో పేర్కొన్నారు. ఇక ద‌లైలామా 90 ఏళ్లు నిండ‌డంతో ఆయ‌న త‌ర్వాతి వార‌సుడి గురించి ఇటీవ‌లే తీవ్రంగా చ‌ర్చ న‌డిచింది. ఈ విష‌యంపై భార‌త్‌, చైనా మ‌ధ్య తీవ్రంగా చ‌ర్చ జ‌రుగుతోంది. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని భార‌త్ ఇటీవ‌లే స్పష్టం చేసిన విష‌యం తెలిసిందే. అయితే, భార‌త్ నిర్ణ‌యాన్ని చైనా తీవ్రంగా ఖండించింది. టిబెటన్‌ బౌద్ధ గురువు దలైలామాకు తన వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియను నిర్ణయించే అధికారం లేదని బీజింగ్ స్ప‌ష్టం చేసింది. టిబెటన్ బౌద్ధమతంలో ‘లివింగ్ బుద్ధాల’ పునర్జన్మ అనేది 700 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఒక చారిత్రక, మతపరమైన సంప్రదాయమని పేర్కొంది. ఈ వ్యవస్థను కొనసాగించాలా? వద్దా ? అని నిర్ణయించే అధికారం 14వ దలైలామాకు లేదని వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి :

OTT | ఈ వారం ఓటీటీలో సంద‌డే సందడి… రొమాన్స్ నుంచి క్రైమ్ వరకు విభిన్న కంటెంట్‌తో ..
Ram Charan | అభిమానం ఉన్మాదంగా మారుతుందా.. అపోలో ఆసుపత్రి వద్ద రామ్ చరణ్‌ని ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్

Latest News