Ram Charan | సెలబ్రిటీలపై అభిమానానికి హద్దులు లేకపోతే అది ఎలాంటి ఇబ్బందులకు దారితీస్తుందో మళ్లీ ఒకసారి స్పష్టమైంది. అభిమానుల ప్రేమ కొన్నిసార్లు ఉన్మాదంగా మారి వారికే కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా అసౌకర్యాన్ని కలిగించే ఘటనలు గతంలో ఎన్నో చోటుచేసుకున్నాయి. ఇంతకుముందు మలేషియాలో ఓ కార్యక్రమం ముగించుకుని చెన్నైకి చేరుకున్న తమిళ స్టార్ హీరో విజయ్‌ను అభిమానులు విమానాశ్రయంలో చుట్టుముట్టిన ఘటన అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. సెల్ఫీల కోసం అభిమానులు ఒక్కసారిగా మీదికి రావడంతో విజయ్ కిందపడే పరిస్థితి కూడా ఏర్పడింది. అదే తరహా దృశ్యాలు తాజాగా హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రి వద్ద రామ్ చరణ్ విషయంలో కనిపించాయి.
రామ్ చరణ్–ఉపాసన దంపతులకు కవలలు జన్మించారనే వార్త వెలువడిన వెంటనే మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొనడం సహజమే అయినప్పటికీ, ఆ ఆనందం అదుపు తప్పి హడావుడిగా మారడం అనేక మందిని ఆందోళనకు గురిచేసింది. ఉపాసనను, కవలలను చూడటానికి రామ్ చరణ్ తన చిన్నారి కుమార్తె క్లీంకారతో కలిసి అపోలో ఆసుపత్రికి చేరుకున్న సమయంలో వందలాది మంది అభిమానులు అక్కడికి చేరుకుని భారీగా గుమికూడారు. చరణ్ కారు దిగగానే సెల్ఫీల కోసం అభిమానులు ఒక్కసారిగా కారును చుట్టుముట్టడంతో పరిస్థితి నియంత్రణ తప్పింది. కారు డోర్ తెరిచి దిగడానికి కూడా వీలు లేకుండా అభిమానులు దగ్గరకు రావడం అక్కడి భద్రతా సిబ్బందికి సవాల్‌గా మారింది.
ఆ సమయంలో రామ్ చరణ్ చేతిలో చిన్నారి క్లీంకార ఉండటం పరిస్థితిని మరింత సున్నితంగా మార్చింది. అభిమానుల అరుపులు, తోపులాట చూసి చిన్నారి భయపడిపోవడం, ఏడవడం అక్కడున్న వారిని కలచివేసింది. తన కుమార్తెను కాపాడుకుంటూ లోపలికి వెళ్లాల్సి వచ్చిన రామ్ చరణ్ ముఖంలో కొంత అసహనం కనిపించిందని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. ఆసుపత్రి వంటి ప్రదేశంలో రోగులు, వారి కుటుంబ సభ్యులు ఉండే పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఇలా హడావుడి చేయడం సరైనదేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇలాంటి సంఘటనలు గతంలోనూ అనేకసార్లు చోటుచేసుకున్నాయి. సమంత, విజయ్ వంటి పలువురు నటీనటులు కూడా మాబింగ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాల్లో నిర్వహణ లోపాలపై ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానంతో సెలబ్రిటీలను చూసేందుకు రావడం సహజమే అయినా, వారి వ్యక్తిగత సమయాన్ని, కుటుంబ సభ్యుల భద్రతను గౌరవించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేవలం ఒక సెల్ఫీ కోసం చిన్నారులకూ ఇబ్బంది కలిగించడం సమంజసం కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
