Pregnant women | గర్భిణీలు ఆ ఫుడ్స్‌ జోలికి అస్సలు వెళ్లొద్దు.. ఎందుకో తెలుసా..?

Pregnant women : గర్భంతో ఉన్న మహిళలు ఏదీపడితే అది తినకూడదని, అలా తింటే లేనిపోని సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బర్గర్‌లు, చీజ్‌లు, పేస్ట్రీల వంటి అతిగా ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లొద్దని అంటున్నారు. అలాంటి ఫుడ్స్‌ గర్భిణీలకు ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది. ఆ ఫుడ్స్‌ను గర్భిణీలు సాధ్యమైనంతగా దూరం పెట్టాలని ‘ఎన్విరాన్‌మెంటల్ ఇంటర్నేషనల్ జర్నల్‌’లో ప్రచురించబడిన అధ్యయనం సూచించింది.

  • Publish Date - June 1, 2024 / 03:32 PM IST

Pregnant women : గర్భంతో ఉన్న మహిళలు ఏదీపడితే అది తినకూడదని, అలా తింటే లేనిపోని సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బర్గర్‌లు, చీజ్‌లు, పేస్ట్రీల వంటి అతిగా ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లొద్దని అంటున్నారు. అలాంటి ఫుడ్స్‌ గర్భిణీలకు ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది. ఆ ఫుడ్స్‌ను గర్భిణీలు సాధ్యమైనంతగా దూరం పెట్టాలని ‘ఎన్విరాన్‌మెంటల్ ఇంటర్నేషనల్ జర్నల్‌’లో ప్రచురించబడిన అధ్యయనం సూచించింది. చీజ్‌ బర్గర్ లేదా బాక్స్‌డ్‌ పేస్ట్రీని తినే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సలహా ఇచ్చింది. ఆశ్చర్యకరంగా ఈ అధ్యయనం ఫ్రైస్, బర్గర్స్‌, షేక్స్‌, కేక్స్‌ వంటి ఆహారంపైనే కాకుండా.. ఆ ఆహారం తయారీ నుంచి వినియోగదారుడు తినేవరకు దానితో సంబంధం ఉండే వివిధ వస్తువుల గురించి కూడా వివరించింది.

ఆహారాన్ని ప్యాక్‌ చేసే కవర్‌లు, ఆ ఆహారం తయారీ, ప్యాకింగ్‌ సందర్భంగా ఫుడ్‌ స్టాల్స్‌ సిబ్బంది వాడే గ్లోవ్స్‌ ఆహారంలోకి కెమికల్స్‌ను వదులుతాయని పరిశోధకులు గుర్తించారు. గర్భిణీలు ఇలాంటి ఆహారం తీసుకున్నప్పుడు ఆ రసాయనాలు తన రక్త ప్రవాహంలోకి, ఆ తర్వాత ప్లాసెంటా ద్వారా పిండం రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయని, దాంతో పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం, నెలలు నిండకముందే పుట్టడం, అదేవిధంగా ఆటిజం, ADHD లాంటి మానసిక రుగ్మతలతో పిల్లలు జన్మించే ప్రమాదం ఉందని తెలిపారు. గర్భిణీలు అతిగా ప్రాసెస్‌ చేసిన ఆహారం తీసుకుంటే రక్తంలోకి చేరే రసాయనాలు గర్భస్థ శిశువుకు ప్రమాదకరమని తెలిపిన మొదటి అధ్యయనం తమదేనని వారు పేర్కొన్నారు.

2006 నుంచి 2011 వరకు పేర్లు నమోదు చేసుకున్న 1031 మంది గర్భిణీలపై తమ పరిశోధన జరిగిందన్నారు. అతిగా ప్రాసెస్‌ చేసిన ఆహారం తీసుకున్న గర్భిణీల యూరిన్‌ శాంపిల్స్‌ ద్వారా వారి రక్తంలో కెమికల్స్ చేరినట్లు గుర్తించామని చెప్పారు. పరిశోధనలో పాల్గొన్న గర్భిణీలకు 10 శాతం నుంచి 60 శాతం వరకు మోతాదుల్లో అతిగా ప్రాసెస్‌ చేసిన ఆహారం అందించామని, వారిలో ప్రతి 10 శాతం అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు 13 శాతం చొప్పున 2ఇథైల్‌ హెక్సైల్‌ అనే కెమికల్ పెరగడాన్ని గమనించామని తెలిపారు. కాబట్టి గర్భిణీలు అతిగా ప్రాసెస్‌ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం ఉత్తమమని పరిశోధకులు చెబుతున్నారు.

Latest News