Site icon vidhaatha

వేడి నీళ్ల స్నానం చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!

విధాత‌: బద్ధకంగా గడిపేందుకు ఎంతో అనువైన కాలం ఏదైనా ఉందా అంటే అది చలికాలం అని చెప్ప‌వ‌చ్చు. ఉదయాలు చాలా చల్లగా బద్ధకంగా ఉంటాయి. స్నానం చెయ్యటమంటే కొంచెం కష్టమే. అందరూ వేడి నీళ్లతో స్నానం చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.

ఎందుకంటే వేడి నీటి స్నానం బద్దకాన్ని వదిలిస్తుంది అని. కొంచెం ఉత్సాహాన్ని కూడా తెస్తుంది. గీజర్ ఆన్‌లో పెట్టుకొని వేడివేడి నీళ్లు ఒంటి మీద పడుతుంటే ఆనందంగానే ఉంటుంది. కొందరైతే కాలంతో పని లేకుండా స్నానం అంటే చాలు వేడి నీళ్లే కావాలంటారు. మరి ఇది మంచిదేనా? ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారో చూద్దాం.

వేణ్ణీళ్ల స్నానం చెయ్యటం ఆరోగ్యానికి చెరుపు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణం చల్లగా ఉందని వేడిగా మరిగే నీటితో స్నానం చేస్తుంటారు. ఇలా వేడి నీటి స్నానం రకరకాల సమస్యలకు కారణం కావచ్చట. చన్నీటి స్నానం కష్టం అనుకుంటే గోరువెచ్చని నీటిని అయినా స్నానానికి వాడాలని చెబుతున్నారు నిపుణులు.

మొటిమలు ఎక్కువవుతాయి

వేడి నీళ్లు శరీరంలోని సహజ నూనెలను తొలగిస్తాయి. చర్మం మీద పెరిగే ఆరోగ్య కారక బ్యాక్టీరియా వేడికి నశిస్తుంది. మొటిమల సమస్యతో బాధ పడేవారిలో వేడి నీటి స్నానం సమస్య మరింత పెరిగేందుకు కారణం కాగలదు. చర్మం మీద పెరిగే ఆరోగ్యకర బ్యాక్టీరియా చర్మాన్ని తేమగా ఉంచుతుంది. చర్మం లోపల ఉన్న మురికిని తొలగించేందుకు కూడా ఇది అవసరమే. ఈ బ్యాక్టీరియా నశించినపుడు చర్మ కణాల్లో తేమ తగ్గడం వల్ల పెళుసుగా మారి సులభంగా విరిగిపోతాయి.

చర్మం సున్నితం అవుతుంది

ఎక్కువ సమయం పాటు స్నానం చేసినా లేక వేడి ఎక్కువగా ఉన్న నీటితో స్నానం చేసినా చర్మం పొడి బారి సున్నితంగా తయారవుతుంది. ఇలా జరిగినపుడు చర్మం సులభంగా ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చలి కాలంలో స్నానం పూర్తయిన తర్వాత తప్పనిసరిగా అక్వా బేస్డ్ క్రీములు ఉపయోగించాలని నిపుణుల సలహా.

జుట్టు పెరగడం కష్టం
వేడి నీటి షవర్ వల్ల జుట్టు కుదుళ్లకు నష్టం వాటిల్లుతుంది. వేడి వేడి నీళ్లతో తలస్నానం చేస్తే స్కాల్ప్ మీద చర్మానికి రక్త ప్రసరణ తగ్గుతుంది. జుట్టు పెరుగాలంటే రక్త ప్రసరణ సరిగా ఉండడం అవసరం. అంతేకాదు నీటి ఆవిరి వల్ల జుట్టు పెళుసుగా తయారై విరిగి పోతుంది. ఇది జుట్టు రాలడాకి ఒక ముఖ్య కారణం కావచ్చని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. వేడి నీరు చర్మ రంధ్రాలను తెరుస్తుంది. తల మీద హెయిర్ రూట్స్ వదులుగా తయారవుతాయి. ఫలితంగా జట్టు సులభంగా రాలిపోతుంది.

తామర నుంచి గుండె సమస్యల వరకు

వేడి నీటి స్నానం బావుంటుంది. కానీ చర్మ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. తామర వంటి చర్మ సమస్య‌లు తీవ్రంగా మారుతాయి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తే బీపీ కూడా పెరుగుతుంది. గుండె పోటుకు కారణం కావచ్చు. అందుకే వీలైతే చన్నీటి స్నానం చెయ్యాలి. లేదా గోరువెచ్చని నీటి స్నానమే మంచిదట. కాబట్టి చలి ఎక్కువగా ఉందని వేడివేడి నీళ్లను ఒంటి మీద పోసుకోకండి. అది ఎంత మాత్రం మంచిదికాదు.

Exit mobile version