ఒత్తిడి, ఆందోళ‌న‌ల్లో ఇలాంటి ఆహారం తింటే ప్రాణంమీద‌కొస్తుంది.. !

ఒత్తిడి (Pressure) ఆందోళ‌న‌ (Anxiety) లో ఉన్న‌ప్పుడు దాని నుంచి కాస్త బ‌య‌ట‌ప‌డ‌టానికి మ‌న‌కు గుర్తొచ్చేది ఏదైనా తిందామ‌నే

  • Publish Date - December 11, 2023 / 09:36 AM IST

విధాత‌: ఒత్తిడి (Pressure) ఆందోళ‌న‌ (Anxiety) లో ఉన్న‌ప్పుడు దాని నుంచి కాస్త బ‌య‌ట‌ప‌డ‌టానికి మ‌న‌కు గుర్తొచ్చేది ఏదైనా తిందామ‌నే. ఆ తినేవాటిల్లో కూడా చిప్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్ (Fatty Food) ఎక్కువ‌గా ఉంటాయి. ఇలా ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ‌గా ఉన్న ఆహారం తిన‌డం ప్రాణాంత‌క‌మ‌ని తాజా అధ్య‌య‌నం (Study) ఒకటి వెల్ల‌డించింది. ఆ ఆహారం మ‌న ఒత్తిడిని త‌గ్గించ‌క‌పోగా మ‌రింత పెంచుతుంద‌ని.. ఒత్తిడి త‌గ్గించ‌డానికి మ‌న శ‌రీరం తీసుకునే చ‌ర్య‌ల‌ను నెమ్మ‌దింప‌జేస్తుంద‌ని పేర్కొంది.


ప్రొఫెస‌ర్ జెట్ వెల్దూయిజ‌న వ‌న్ జాంటెన్ నేతృత్వంలో సాగిన ఈ అధ్య‌య‌నం వివ‌రాలు ఫ్రాంటియ‌ర్స్ ఇన్ న్యూట్రిషియ‌న్ జ‌ర్న‌ల్‌లో తాజాగా ప్ర‌చురిత‌మ‌య్యాయి. అధ్య‌య‌నంలో భాగంగా ఒత్తిడి, ఆందోళ‌న‌ల్లో ఉన్న‌ప్పుడు ఏమేం ఆహార ప‌దార్థాలు తీసుకుంటున్నారో 18 నుంచి 30 ఏళ్ల వ‌య‌సున్న వారితో ఒక స‌ర్వే నిర్వ‌హించారు. ఇందులో ఎక్కువ మంది ఆ స‌మయాల్లో తాము చాక్లెట్లు లేదా చిప్స్ ఎక్కువ‌గా తీసుకుంటున్నామ‌ని తెలిపారు.


అయితే ఇలాంటి ఆహారం వారి ఆరోగ్యంపై ప్ర‌తికూల ప్ర‌భావానే చూపుతుంద‌ని అధ్య‌య‌నం వెల్ల‌డించింది. ఇందులోని కొవ్వు.. ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌ను నెమ్మ‌దింప‌జేస్తుంద‌ని, దీని వ‌ల్ల మెద‌డుకు ర‌క్త ప్ర‌వాహం త‌గ్గిపోవ‌డం, గుండెపోటు రావ‌డం వంటి ప్ర‌మాదాలు త‌లెత్తుతాయని తెలిపింది. దీనిపై మ‌రింత లోతైన ప‌రిశోధ‌న‌ల కోసం శాస్త్రవేత్త‌లు ఒక చిన్న ప‌రిశోధ‌న చేశారు. ఇందుకోసం ఆరోగ్యం ఉన్న యువ‌తీ యువ‌కుల‌కు చిన్న ప‌రీక్ష పెట్టారు.


కాగా.. వారికి ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌గా బ‌ట‌ర్‌తో చేసిన హై ఫ్యాట్ కంటెంట్‌ క్రాయోసాంట్స్‌ను ఇచ్చారు. తిన్న వెంట‌నే ఒక క‌ష్ట‌మైన గ‌ణిత స‌మ‌స్య‌ను ఇచ్చి కేవ‌లం 8 నిమిషాల్లో పూర్తి చేయాల‌ని చెప్పారు. వారు ఒత్తిడి గుర‌య్యేలా చేయ‌డమే ఇందులో ప్ర‌ధాన ఉద్దేశం. ఈ ప‌రీక్ష‌లో త‌ప్పుడు స‌మాధానాలు చెప్పిన వారి మొహాలు వారి ముందున్న స్క్రీన్ మీద వ‌చ్చేలా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. ఈ అధ్య‌య‌నం ఫ‌లితాల‌ను క్రోడీక‌రించ‌గా.. మాన‌సిక ఆందోళ‌న ఉన్న‌ప్పుడు ఫ్యాట్ ఫుడ్ తింటే గుండె ప‌నితీరు 1.74 శాతం త‌గ్గుతోంద‌ని తేలింది.


ఇది ఒక శాతం త‌గ్గితేనే గుండెపోటు వ‌చ్చి ప్రాణాలు పోతాయని.. ఇలా ఒత్తిడి ఉన్న‌పుడు తిన‌కూడ‌ని ఆహారం తిన‌డం వ‌ల్ల ఆ ముప్పు 13 శాతం పెరుగుతోంద‌ని తేలింది. మ‌నం రోజూ ఎదుర్కొనే ఒత్తిడిని ఈ అధ్య‌య‌నంలో భాగంగా డిజైన్ చేశాం. ఇంటి ప‌నిలో, ఆఫీసు కార్య‌క్ర‌మాల్లో మ‌నం ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటాం. అప్పుడు మ‌న శ‌రీరంలో ర‌క‌ర‌కాల మార్పులు క‌లుగుతాయి. ర‌క్త‌పోటు పెర‌గ‌డం, మెద‌డుకు వెళ్లే ర‌క్త ప్ర‌వాహం పెర‌గ‌డం, ర‌క్త క‌ణాలు కుచించుకుపోవ‌డం వంటివి జ‌రుగుతాయి.


ఇలాంటి సంర‌ద్భాల్లో చిప్స్ లాంటివి తింటే ప్ర‌మాదం అని బ‌ర్మింగ్‌హం యూనివ‌ర్సిటీకి చెందిన ప్రొఫెస‌ర్ రోసైలిండ్ బ‌న్యాహం వెల్ల‌డించారు. అంతే కాకుండా కుటుంబంలో ఎవ‌రికైనా గుండె సంబంధిత జ‌బ్బులు ఉన్నా.. మ‌నకే గ‌తంలో ఉన్న ఈ ఆహారం మ‌రింత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. ఒత్తిడిలో ఉన్న‌పుడు పాలీఫినాల్స్ ఎక్కువ‌గా ఉండే కోకా, బెర్రీలు, ద్రాక్ష ప‌ళ్లు, యాపిల్స్ ఇలా ఎలాంటి పళ్లు అయినా తినొచ్చ‌ని సూచించారు.

Latest News