బీఎస్ఎన్ఎల్‌ పరిస్థితి దయనీయం: సేవలు బలహీనం – వినియోగదారుల ఆవేదన

బీఎస్ఎన్ఎల్‌ ఒకప్పుడు టెలికం రంగానికి గర్వకారణం. కానీ ఇప్పుడు బలహీనమైన కస్టమర్‌ సపోర్ట్‌, సాంకేతిక వెనుకబాటు, సాంకేతికంగా వెనుకబాటు కారణంగా వినియోగదారులు నిరాశ పడుతున్నారు. ఇంటర్నెట్ సమస్యలపై రోజులు గడిచినా స్పందన రాకపోవడంతో, చాలా మంది ప్రైవేట్‌ నెట్‌వర్క్‌లకు మారుతున్నారు.

BSNL Losing Trust? Users Shift to Private Networks Amid Poor Service

BSNL Losing Trust? Users Shift to Private Networks Amid Poor Service

హైదరాబాద్‌, అక్టోబర్‌ 1 (విధాత‌):
BSNL Poor Service | టెలికం రంగానికి ఒకప్పుడు మూలస్తంభంగా నిలిచిన భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్ఎన్ఎల్‌) ఇప్పుడు క్రమంగా కుప్పకూలిపోతుందా అన్న ప్రశ్న వినియోగదారుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ ప్రైవేట్‌ ఆపరేటర్ల దూకుడు వల్ల మాత్రమే కాకుండా, స్వంత నిర్లక్ష్యం, సాంకేతిక వెనుకబాటు, బలహీనమైన కస్టమర్‌ సర్వీస్‌ కారణంగా వినియోగదారుల నమ్మకం కోల్పోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బిఎస్​ఎన్​ఎల్​ సేవలు : కర్ణుడి చావుకు పదివేల కారణాలు – సాంకేతికంగా వెనుకబాటు

ఒకప్పుడు గ్రామస్థాయిలోనూ నెట్‌వర్క్‌ అందించిన ఏకైక ఆపరేటర్‌గా వెలిగిన బీఎస్ఎన్ఎల్‌, ఇప్పుడు ప్రైవేట్‌ సంస్థల దూకుడు తట్టుకోలేక కుప్పకూలుతోందని నిపుణులు చెబుతున్నారు. జియో 2016లోనే 4జీని ప్రవేశపెట్టగా, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు ఇప్పటికే 5జీ దశకు చేరాయి. కానీ బీఎస్ఎన్ఎల్‌ మాత్రం ఇప్పుడిప్పుడే 4జీ సేవలు అందించడం ప్రారంభించింది. ప్రైవేట్ ఆప‌రేట‌ర్ల కోసం కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లే  బీఎస్ఎన్ఎల్‌ను నిర్వీర్యం చేస్తే.. గ‌గ్గోలు పెట్టిన అధికారులు, ఉద్యోగులు.. దానిని కాపాడుకునే విధంగా పని చేయడం లేదని అంటున్నారు. బీఎస్ఎన్ఎల్‌కు ఉన్న‌వే త‌క్కువ ఇంటర్‌నెట్‌ క‌నెక్ష‌న్లు.. ఉన్న కొద్దిపాటి క‌నెక్ష‌న్ల‌కు కూడా సరైన స‌ర్వీస్ ఇవ్వ‌లేని దుస్థితిలో బీఎస్ఎన్ఎల్‌ అధికారులున్నారు.

“బీఎస్ఎన్ఎల్‌ నెట్‌వర్క్‌ అంటే రాదు.. గిరగిరా తిరుగుతుంది..” అనే జోకులు వినిపించేంత స్థాయిలో ప్రజల్లో నిరాశ నెలకొంది. ఇంటర్నెట్‌ లేకుండా ఒక్క క్షణం గడవని ఈ కాలంలో, ఘ‌న‌త వ‌హించిన బీఎస్ఎన్ఎల్‌ త‌న క‌నెక్ష‌న్ దారుల‌కు ఇంట‌ర్నెట్ అంత‌రాయం క‌లుగుతే 10 రోజుల‌కు కూడా స్పందించ‌దు. ఇదే మంటే మీకు ఇంకా రాలేదా? అని స‌మాధానం ఇస్తారు కానీ ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ వ‌చ్చే విధంగా మాత్రం చేయ‌రు. ఇంట‌ర్నెట్ లేకుండా గ‌డ‌వ‌ని నేటి ప‌రిస్థితుల్లో బీఎస్ఎన్ఎల్‌ మాత్రం 10 రోజులైనా  త‌న క్ష‌నెక్ష‌న్ దారుల‌కు ఇంట‌ర్నెట్ అంతరాయాన్ని తొల‌గించ‌దు.. అలాంట‌ప్పుడు తాను బీఎస్ఎన్ఎల్‌ ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ ఎందుకు తీసుకోవాల‌ని స‌ద‌రు వినియోగ‌దారుడు ప్ర‌శ్నిస్తున్నాడు.

అదనంగా, రూ.20 వేల కోట్లకు పైగా ఉన్న అప్పులు, కొత్త టవర్స్‌, ఫైబర్‌ విస్తరణలో పెట్టుబడుల లోటు, కేంద్ర నిర్ణయాల ఆలస్యం—all together—బీఎస్ఎన్ఎల్‌ను మరింత కుంగదీస్తున్నాయని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

బిఎస్​ఎన్​ఎల్​ కస్టమర్‌ సపోర్ట్‌ – బలహీనతే ప్రధాన సమస్య

సేవలలో బలహీనతను ఎత్తిచూపుతూ వినియోగదారులు తమ ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. చందానగర్‌కు చెందిన ఒక వినియోగదారు ఇలా చెబుతున్నారు:

“మా ఇంటికి బీఎస్ఎన్ఎల్‌ ఫైబర్‌ కనెక్షన్‌ తీసుకున్నాం. 10 రోజుల క్రితం నెట్‌ కట్‌ అయింది. స్థానిక సిబ్బంది స్పందించకపోవడంతో జేటీవోకు కాల్‌ చేశాను. ఆన్‌లైన్‌లో కంప్లైంట్‌ పెట్టి (నంబర్‌ 114348231) ఆరు రోజులు గడిచినా ఇంటర్నెట్‌ రాలేదు. నా కుమారుడికి అక్టోబర్‌ 9న పోటీ పరీక్ష ఉంది. ఇలా విద్యార్థులను శిక్షించడం సబబా? బీఎస్ఎన్ఎల్‌ మీద నమ్మకం పెట్టుకోవడమే మా తప్పా?” ఇలాంటి ఘటనలు వందల సంఖ్యలో వినిపిస్తున్నాయి.

తెలంగాణ‌, ఏపీ రెండు కూడా తెలుగు రాష్ట్రాలు.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ఎక్కువ మంది తెలుగు మాట్లాడుతారు. చాలా మంది ప్ర‌జ‌ల‌కు మ‌రో భాష కూడా రాదు.. కానీ బీఎస్ఎన్ఎల్‌ టోల్ ఫ్రీ నెంబ‌ర్‌కు ఫోన్ చేస్తే బోలియే అనే హిందీ మాట‌లు త‌ప్ప మ‌రో భాష మాట్లాడ‌రని వినియోగదరులు చెబుతున్నారు. తెలుగుపై అంత నిర్ల‌క్ష్యంగా బీఎస్ఎన్ఎల్‌ ఉన్నదని అంటున్నారు. దీంతో చాలా మంది నెట్‌వర్క్‌ స‌మ‌స్య త‌లెత్తితే ఫిర్యాదు న‌మోదు చేయ‌డం కోసం టోల్ ఫ్రీ నెంబ‌ర్‌కు ఫోన్‌ చేయాలన్నా ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు.  ఫిర్యాదు చేసినా స్థానిక అధికారులు స్పందించకపోవడం, కస్టమర్‌ సపోర్ట్‌ పూర్తిగా బలహీనంగా ఉండటం వినియోగదారులను నిరాశకు గురి చేస్తోంది.

జియో, ఎయిర్‌టెల్‌ ఆఫర్లు, వేగవంతమైన స్పందనలతో కస్టమర్లను ఆకర్షిస్తుంటే, బీఎస్ఎన్ఎల్‌ మాత్రం “ఫిర్యాదు నమోదు చేశాం” అనే మాటకే పరిమితమైపోతుందని వినియోగదారులు మండిపడుతున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే, బీఎస్ఎన్ఎల్‌ ఉన్న కొద్దిమంది వినియోగదారులనూ కోల్పోయే పరిస్థితి తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అన‌ర్థాల‌కు  కేంద్ర ప్ర‌భుత్వం,టెలికం శాఖ మంత్రి, ఇలా ప్ర‌భుత్వ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్‌ ఆల‌స్యంగా తీసుకునే నిర్ణ‌యాలే కార‌ణ‌మన్న విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వెలువ‌డుతున్నాయి. ఫ‌లితంగా కొత్త‌టెక్నాల‌జీని అప్‌గ్రేడ్ చేసుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు.

బీఎస్ఎన్ఎల్‌ ఒకప్పుడు టెలికం రంగానికే గర్వకారణం. కానీ నేడు సాంకేతికంగా వెనుకబడిపోవడం, కస్టమర్‌ సపోర్ట్‌లో బలహీనత, పెట్టుబడుల లోటు, ప్రభుత్వ నిర్లక్ష్యం అన్ని కలిసి దీన్ని ‘ప్రభుత్వ బ్రాండ్‌’ నుంచి ‘బలహీన బ్రాండ్‌’గా మార్చేశాయి. వినియోగదారులు ఇక సహనం కోల్పోతుండగా, బీఎస్ఎన్ఎల్‌ తిరిగి పుంజుకోవాలంటే తక్షణ సవరణలు తప్పనిసరి.

Exit mobile version