విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ లో మరో నకిలీ ఐపీఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్లుగా ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ అధికారి అంటూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని ఫిల్మ్‌నగర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. శశికాంత్ అనే వ్యక్తి ఐపీఎస్, ఐఏఎస్ అధికారి అంటూ గత కొంతకాలంగా బిల్డర్లు, వ్యాపారులను మోసం చేస్తున్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది.
పోలీసుల తెలిపిన సమాచారం ప్రకారం.. అధికారిగా కనిపించేందుకు శశికాంత్ ఇద్దరు గన్‌మెన్లను అద్దెకు పెట్టుకొని నిజమైన అధికారిలా వ్యవహరిస్తూ బిల్డర్లను బెదిరించినట్లు తెలుస్తోంది. ‘స్పెషల్ ఆఫీసర్’ అని చెప్పుకుంటూ పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసినట్లుగా శశికాంత్ పై ఆరోపణలు వచ్చాయి. అధికారులు అనుసరించే విధంగా నకిలీ పాసులు, ఐడీ కార్డుతో పాటు అధికారిక లేఖల వరకు ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
కాగా, శశికాంత్ చేస్తున్న మోసాలపై బిల్డర్లు ఇచ్చిన ఫిర్యాదులు, సేకరించిన ఆధారాల మేరకు పోలీసులు ఆయనను బుధవారం ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా, గన్‌మెన్లను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
