విధాత, హైదరాబాద్ :
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక హవా నడుస్తోంది. ఈ బైపోల్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా ముందుకు వెళ్తున్నాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. ఈ క్రమంలో హైదరాబాద్ తో పాటు తెలంగాణలో జూబ్లీహిల్స్ పేరు మార్మోగుతోంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ గురించిన విషయాల గురించి ప్రజలు ఆసక్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారు. అధికారుల కాలనీలు, రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్, సెటబ్రీటీలతో పాటు సంపన్నులు నివసించే ప్రాంతంగా జూబ్లీహిల్స్ ప్రఖ్యాతి గాంచింది. జూబ్లీహిల్స్ ప్రాంతం1950 వరకు పల్లె స్థాయిలోనే ఉండేది. చుట్టు పక్కల మొత్తం బంజారాహిల్స్, షేక్ పేట్, ఫిల్మ్ నగర్ ప్రాంతం ఒకే అడవిగా ఉండేది. అయితే, ఈ ప్రాంతానికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది? ఎవరు పేరు పెట్టారు? అనే వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.
జూబ్లీహిల్స్ అనే పేరు 1937లో వచ్చింది..
1937 సమయంలో హైదరాబాద్ రాజ్యానికి నిజాం మిర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ఉండేది. ఈ క్రమంలో తన పాలనకు 25 ఏళ్లు (సిల్వర్ జూబ్లీ) నిండడంతో వేడుకను నిర్వహించాడు. ఆ టైంలో హైదరాబాద్ రాజ్యం కేవలం 5కిలోమీటర్ల పరిధిలోనే ఉండేది. దీంతో నిజాం తన 25 ఏళ్ల పాలనకు గుర్తుగా ఆ ప్రాంతానికి ‘సిల్వర్ జూబ్లీ హిల్స్’ అని నామకరణం చేశారు. అంటే, ఇది నిజాం కాలంలో ‘సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్’ గుర్తుగా ఈ ప్రాంతం నిలిచింది. కాలక్రమంలో జూబ్లీహిల్స్ స్థిరపడిపోయి.. హైదరాబాద్ నగరంలో ప్రముఖ ప్రాంతంగా పేరు సంపాదించుకుంది.
1940ల్లో జూబ్లీహిల్స్ ప్రాంతంలో కొన్ని చిన్న సూఫీ దర్గాలు, చిన్న చిన్న మందిరాలు మాత్రమే ఉండేవి. వాటిలో ఇప్పటికీ చాలా కట్టడాలు ఫిల్మ్ నగర్, రోడ్ నంబర్ 45వైపు కనిపిస్తాయి. 1970ల్లో మద్రాస్ నుంచి హైదరాబాద్ కు సినిమా పరిశ్రమ వచ్చినప్పుడు.. జూబ్లీహిల్స్ కు పక్కనే ఉన్న ఫిల్మ్ నగర్ లో మొదటగా స్టూడియలో నిర్మించారు. చిత్రనగర్, రామానాయుడు స్టూడియో మొదట ఇక్కడే ఉన్నాయి. ఈ కారణంగా జూబ్లీహిల్స్ ప్రాంతం సినిమా రంగ ప్రముఖుల మొదటి నివాస ప్రాంతంగా మారింది. ఒకప్పుడు వేలలో పలికిన ఇక్కడి భూములు ఇప్పుడు కోట్లల్లో పలుకుతోంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, 1950 ల్లో ఇక్కడి కొండల్లో కడప రాళ్లు, లైమ్ స్టోన్ తవ్వకాలు జరిగేవి. ఈ రాళ్లను సికింద్రాబాద్ లోని పాత బిల్డింగుల నిర్మాణంలో వినియోగించారు. ఒకప్పుడు రాళ్ల పల్లెగా ఉన్న జూబ్లీహిల్స్ ప్రాంతం ఇప్పుడు రతనాల సిటీగా మారిందని చెప్పొచ్చు.