విధాత: రాష్ట్రానికి పెట్టుబడుల సాధన లక్ష్యంగా జపాన్ లో పర్యటిస్తున్న సీఎం ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్ దిగ్గజ కంపెనీ సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. సోని కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలుసుకుంది. సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ఆ కంపెనీ ప్రతినిధులు ప్రదర్శించారు. వాని ఉత్పత్తులతో పాటు పని తీరును రేవంత్ రెడ్డి బృందానికి వివరించారు.
ఈ సందర్భంగా సోనీ కంపెనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్‌పై వివరణాత్మక చర్చలు సాగాయి. యానిమేషన్, వీఎఫ్ఐ, గేమింగ్ రంగాలలో హైదరాబాద్ లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను తెలంగాణ రైజింగ్ బృందం సోనీ కంపెనీ ప్రతినిధులకు వివరించింది. తెలంగాణలో ఎండ్-టు-ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలనే తన భవిష్యత్తు విజన్ ను సీఎం రేవంత్ రెడ్డి వారితో పంచుకున్నారు. ఇందుకోసం సోనీ కంపెనీ ముందుకొస్తే అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.