CM Revanthreddy | పెన్నులపై మన్ను కప్పితే గన్నులవుతాయి.. అందెశ్రీ సంస్మరణ సభలో సీఎం

ప్రముఖ కవి, గాయకుడు, రచయిత అందెశ్రీ సంస్మరణ సభను హైదరాబాద్ లోని రవీంద్ర భారతీలో శనివారం నిర్వహించారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. తెలంగాణ గడ్డపై ఆధిపత్యాన్ని రాష్ట్ర ప్రజలు సహించరని పేర్కొన్నారు.

విధాత, హైదరాబాద్ :
ప్రముఖ కవి, గాయకుడు, రచయిత అందెశ్రీ సంస్మరణ సభను హైదరాబాద్ లోని రవీంద్ర భారతీలో శనివారం నిర్వహించారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. తెలంగాణ గడ్డపై ఆధిపత్యాన్ని రాష్ట్ర ప్రజలు సహించరని పేర్కొన్నారు. ఆధిపత్యానికి, దళితులు, గిరిజనులపై ఆధిపత్యానికి నిరసనగా బండి యాదగిరి ‘బండెనక బండి కట్టి’ అనే బాని కట్టడం వల్ల నిజాం పీఠం కదిలిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గద్దర్, గూడ అంజయ్య, బండి యాదగిరి, అందెశ్రీ.. మలిదశ ఉద్యమానికి పునాది వేశారన్నారు. బడికి వెళ్లని అందెశ్రీ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపారన్నారని కొనియాడారు.

ప్రపంచంలో ఏ మూలన ఉన్న జయజయహే తెలంగాణ గీతాన్ని చేర్చి ఉద్యమాన్ని ఉధృతం చేశారన్నారు. ఉద్యమ సమయంలో అందెశ్రీ పాట లేకుండా ఏ సభ జరగలేదన్నారు. జయజయహే గీతం తెలంగాణ స్పూర్తిగా నిలిచిందన్నారు. కవుల గానాలను తెలంగాణలో వినిపించకుండా ఆనాటి పాలకులు ప్రయత్నించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెన్నులపై మన్ను కప్పితే గన్నులు అవుతాయని పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా కాంగ్రెస్ మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. సర్వం త్యాగం చేసిన ఉద్యమకారులను ఆదుకోవడం తన బాధ్యత అని సీఎం వెల్లడించారు. రాష్ట్ర సాధనే కాకుండా.. నేడు తాను సీఎం కావడానికి ఉద్యమకారులు, కవులు, కళాకారులే కారణమని స్పష్టం చేశారు.

అందే శ్రీ రచించిన నిప్పుల వాగు పుస్తకం ప్రతి లైబ్రరీలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తొమ్మిది మంది ఉద్యమకారులను సన్మానించడంతో పాటు వారి ఆత్మగౌరవాన్ని నిలిపేందుకు వారికి 300 గజాల స్థలం కేటాయించటంతో పాటు భారత్ ఫ్యూచర్ సిటీలో వాళ్లకు ఇండ్లు కట్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దళితుల వల్లే గ్రామాల్లో రాణించామన్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎస్సీ వర్గీకరణ అమలుకు పోరాటం చేశామని చెప్పారు. ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా వర్గీకరణ అమలు చేశామన్నారు. వర్గీకరణతో దళితులు ఉన్నత స్థాయిలో రాణించి రాష్ట్ర నిర్మాణంలో భాగం కావాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. కవులు కళాకారులు ఎందరు ఉన్నా అందె శ్రీ కోహినూరు వజ్రంలా నిలబడతారని సీఎం కొనియాడారు.

Latest News