విధాత, హైదరాబాద్ : బీజేపీ, బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే చెత్త బుట్టలో వేసినట్లేనని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన శనివారం జూబ్లీహిల్స్ లో మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. అధికార పార్టీని గెలిపిస్తే ఇంటివారిని గెలిపించినట్లేనని తెలిపారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇక్కడ బై పోల్ వచ్చిందన్నారు. రాష్ట్రంలో మరో మూడేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని.. ఈ మూడేళ్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు జగ్గారెడ్డి సూచించారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేసి ఉపయోగం లేదని.. ఈ పార్టీలకు ఓటేస్తే చెత్త బుట్టలో వేసినట్లేనని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధిలో దూసుకుపోవడం ఖాయమన్నారు. ఇన్నాళ్లు కొళ్లురు ప్రాంతంలో లేని డబుల్ బెడ్ రూం ఇండ్లు రేవంత్ రెడ్డి చెబితే వచ్చాయన్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల కంటే నవీన్ యాదవ్ వంద రెట్లు బెటర్ అని జగ్గారెడ్డి తెలిపారు.
