- ‘అధికార’ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హంగ్ వాత
- ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇంచార్జ్‌ల ఆశలు గల్లంతు
- చాలెంజ్‌గా తీసుకున్న రెండు పార్టీల లీడర్లు
- సీఎం రేవంత్, కేటీఆర్ హోరాహోరీ ప్రచారం
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Municipal Elections | అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు మున్సిపల్ ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్న జిల్లాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకటి. ఇక్కడ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరులో జరిగిన భారీ బహిరంగ సభ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సైతం మిగిలిన జిల్లాల కంటే ఉమ్మడి వరంగల్ జిల్లా పైన్నే ఎక్కువ ఫోకస్ చేశారు. సీఎం కంటే తానేమి తక్కువ అన్నట్లు మున్సిపల్ ఎన్నికల్లో సైతం ‘హెలికాప్టర్’ వినియోగించారంటే ఈ జిల్లా ప్రచారానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు.
సర్వశక్తులొడ్డిన బీఆర్ఎస్ ఇంచార్జ్‌లు
బీఆర్ఎస్ నేత కేటీఆర్ నర్సంపేట, వర్దన్నపేట, మహబూబాద్, తొర్రూరు, భూపాలపల్లి, పరకాల మున్సిపాలిటీల్లో రెండు రోజులు రోడ్‌షోలు నిర్వహించి ప్రచారాన్ని హోరెత్తించారు. ఇదే స్థాయిలో నియోజకవర్గ ఇంచార్జ్‌లుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలంతా గట్టి పట్టుదలతో సర్వశక్తులొడ్డారు. తమకు సమకూరిన ఆర్థిక, అంగ బలాలతోపాటు, అనుభవాన్ని, పోల్ మేనేజ్‌మెంట్‌ను వందశాతం ఉపయోగించారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా తమ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామతో పాటు ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ఎక్కడా తగ్గకుండా బీఆర్ఎస్ ప్రణాళిక రచించి అమలు చేసింది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తాము పోటీచేసినట్లుగా భావించి ప్రచారం సాగించారు. ఎన్నికల వ్యూహాలను, ఎత్తులను అమలు చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి, రెడ్యానాయక్, తాడికొండ రాజయ్య, సత్యవతి రాథోడ్, మాజీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు కవిత, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరూరి రమేష్, బడే నాగజ్యోతిలకు తోడు దాస్యం వినయ్ భాస్కర్, పోచంపల్లి, నన్నపునేని నరేందర్ తోపాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ వరంగల్ నాయకత్వమంతా మున్పిపాలిటీ ఎన్నికల్లో మోహరించారు. తమ అనుభవాన్నంతా రంగరించి ఎన్నికలను ఎదుర్కొన్నారు.
Municipal Elections | ఆరు జిల్లాలు.. 12 మున్సిపాలిటీల ఉమ్మడి ఓరుగల్లు ఓటరు తీర్పు విలక్షణం
కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు స్థానాల్లో బీఆర్ఎస్ 10 స్థానాల్లోకాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇందులో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం… కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యే మాత్రమే బీఆర్ఎస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల పుణ్యమా అంటూ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అధికార అహంకారం, కనీస సమన్వయం లేకపోవడం, జిల్లాలో ఇద్దరు మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఉన్నా తమతమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్న తీరు, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య విభేదాలు, నాయకత్వ లోపంతో పాటు ఎమ్మెల్యేల అనుభవరాహిత్యం బహిర్గతమైనట్లుగా భావిస్తున్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటితో పూర్తిస్థాయిలో లేని సయోధ్య వెరసి అన్నీ బహిర్గతమయ్యాయని భావిస్తున్నారు. ఈ కారణంగానే రెండు పక్షాల మధ్య హోరాహోరి సాగినట్లు చెబుతున్నారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవడం, గ్రూపులు, పాత, కొత్త నాయకుల మధ్య విభేదాలు ఈ ఎన్నికల ఫలితాలపై ప్రభావం కనబరిచాయంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా అనుభవరాహిత్యం వల్ల తమ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలను గెలుచుకునేందుకు కొందరు చెమటోడ్చగా కొందరు విఫలమైన ఫలితంగానే ఏ జిల్లాలో లేని విధంగా ‘హంగుల’ ఫలితాలొచ్చాయని భావిస్తున్నారు. మహబూబాబాద్, పాలకుర్తి, వర్ధన్నపేటల్లో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మురళీనాయక్, యశస్వినిరెడ్డి, కేఆర్ నాగరాజు కావడంతో ఫలితాలు ప్రతికూలంగా వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ముగ్గురికి రాజకీయ అనుభవం కూడా పెద్ద లేకపోవడం ఫలితంగా వెనుకంజలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అదే తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందినప్పటికీ రామచంద్రునాయక్, గండ్ర సత్యనారాయణలకు రాజకీయ అనుభవం ఉపయోగపడినట్లు చెబుతున్నారు. జనగామ నుంచి ఎమ్మెల్యే లేక పోయినప్పటికీ తీవ్రంగా ప్రయత్నించారు. మహబూబాబాద్ లో సీపీఐతో విభేదాలు కూడా కొంపముంచాయి. ఒక్క మున్సిపాలిటీ మేరకు ఆలోచిస్తే ఉమ్మడి జిల్లా అంతటా ప్రభావం కనబరినట్లు లెక్కలు వేస్తున్నారు. మహబూబాద్,తొర్రూరు, వర్దన్నపేట, భూపాలపల్లి,జనగామ ఫలితాలపై సీపీఐ ప్రభావం కనబరిచిందంటున్నారు. ఈ అవకాశాన్ని బీఆర్ఎస్ వినియోగించుకుని సానుకూల ఫలితాలు తెచ్చుకున్నట్లు భావిస్తున్నారు. ఈ మున్సిపల్ ఫలితాల నుంచి రెండు పార్టీల నేతలు గుణపాఠం తీసుకోకుంటే రాబోయే ఫలితాలు కూడా దీనికి భిన్నంగా ఉండవని అంచనా వేస్తున్నారు.
Rythu Bharosa : ఈ నెల 17 లేదా 18వ తేదీ నుంచి..రైతుల ఖాతాల్లో భరోసా సొమ్ములు..
