Municipal Elections | ఆరు జిల్లాలు.. 12 మున్సిపాలిటీల ఉమ్మడి ఓరుగల్లు ఓటరు తీర్పు విలక్షణం

ఉమ్మడి వరంగల్‌ జిల్లా పట్టణ ఓటర్లు విలక్షణ తీర్పు చెప్పారు. మొత్తం 12 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్‌ ఏడు చోట్ల విజయం సాధించగా.. ఒకటి బీఆరెస్‌ దక్కించుకుంది. నాలుగు మున్సిపాలిటీల్లో హంగ్‌ ఏర్పడింది. దీంతో ఈ నాలుగు మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు ఇప్పటికే హంగ్‌ రాజకీయాలు ప్రారంభమయ్యాయి.

Municipal Elections | ఆరు జిల్లాలు.. 12 మున్సిపాలిటీల ఉమ్మడి ఓరుగల్లు ఓటరు తీర్పు విలక్షణం
  •  ఏడు మున్సిపాలిట్లో కాంగ్రెస్ జెండా
  • తొర్రూరులో బీఆర్ఎస్ గెలుపు
  • నాలుగు మున్సిపాలిటీల్లో హంగు
  • కీలకం కానున్న సీపీఐ, స్వతంత్రులు
  • ఎక్స్ అఫిషియో మెంబర్ల ఓట్లు

విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Municipal Elections | మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పట్టణ ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఆరు జిల్లాలుండగా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. శుక్రవారం ఫలితాల్లో 7 మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. భూపాలపల్లి, నర్సంపేట, ములుగు, పరకాల, స్టేషన్ ఘన్‌పూర్‌, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో కైవసం చేసుకున్నది. తొర్రూరు మున్సిపాలిటీని బీఆర్ఎస్ గెలుచుకున్నది. నాలుగు మున్సిపాలిటీలు మహబూబాబాద్, కేసముద్రం, వర్ధన్నపేట, జనగామల్లో హంగ్‌ ఏర్పడింది. దీంతో హంగ్‌ ఏర్పడిన నాలుగు మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్వశక్తులొడ్డుతున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో చైర్మన్ గిరీ దక్కించుకోవాలంటే సీపీఐ, సీపీఎం, బీజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు కీలక పాత్ర నిర్వహించనున్నారు. దీని కోసం రెండు పార్టీల నేతలు క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. గెలిచిన తమ పార్టీల అభ్యర్ధులను క్యాంపులకు తరలించడంతో పాటు ముఖ్యంగా స్వతంత్రులను తమ వైపు తిప్పుకొనేందుకు వారిని ఎత్తుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నిరసనలు, ఆందోళనలు, అడ్డంకులు తలెత్తి ఉద్రిక్తతలకు దారి తీశాయి.

ఓరుగల్లు మున్సిపాలిటీ ఫలితాలిలా
భూపాలపల్లిలో కాంగ్రెస్ భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులున్నాయి. కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 10 స్థానాలు, సీపీఐ 1, బీజేపీ 2, స్వతంత్రులు 1 స్థానంలో గెలుపొందారు. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ కే చైర్మన్ పదవి లభించింది.

నర్సంపేటలో కాంగ్రెస్
నర్సంపేట మున్సిపాలిటీలో 30 వార్డులున్నాయి. 20 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ 7 స్థానాలు, సీపీఎం 1, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1 స్థానాన్ని గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 16 కంటె ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకుంది.

ములుగులో కాంగ్రెస్
ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులున్నాయి. కాంగ్రెస్ అత్యధికంగా 12 స్థానాలు, బీఆర్ఎస్ 5 స్థానాలు, ఇండిపెండెంట్ అభ్యర్ధులు 2, బీజేపీ 1 స్థానంలో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ కే చైర్మన్ గిరిలభిస్తోంది.

పరకాలలో కాంగ్రెస్
పరకాల మున్సిపాలిటీలో 22 వార్డులున్నాయి. కాంగ్రెస్ కు 13 స్థానాలు, బీఆర్ఎస్ కు 6 స్థానాలు, బీజేపీకి 3 స్థానాలు దక్కాయి. మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది.

స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్
స్టేషన్ ఘన్‌పూర్‌ మున్సిపాలిటీలో 18 వార్డులున్నాయి. కాంగ్రెస్ 13 స్థానాలు గెలిచింది. బీఆర్ఎస్ 5 వార్డులకే పరిమితమైంది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీలో చేరి, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

డోర్నకల్‌లో కాంగ్రెస్
డోర్నకల్ లో 15 వార్డులున్నాయి. 11 వార్డులు గెలిచి కాంగ్రెస్ ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నది. బీఆర్ఎస్ కు కేవలం 4 వార్డులు దక్కాయి.

మరిపెడ పై కాంగ్రెస్ జెండా
మరిపెడ మున్సిపాలిటీలో 15 వార్డులున్నాయి. ఇందులో 8 కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ కు 6 వార్డులు, ఇతరులు 1 వార్డు గెలుపొందారు.

తొర్రూరులో బీఆర్ఎస్ గెలుపు
తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులున్నాయి. బీఆర్ఎస్ 9 స్థానాలు దక్కించుకోగా, కాంగ్రెస్ 7 స్థానాలకు పరిమితమైంది.

నాలుగు మున్సిపాలిటీల్లో హంగ్‌
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాద్ జిల్లా కేంద్రంతోపాటు కేసముద్రం, జనగామ జిల్లా కేంద్రం, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్ర మున్సిపాలిటీల్లో హంగు ఏర్పడింది. ఇక్కడ సీపీఐ, స్వతంత్రులు, ఎక్స్ అఫిషియో మెంబర్ల ఓట్లు కీలకం కానున్నాయి. స్థానిక లెక్కలు ఎక్స్ అఫిషియో మెంబర్లను చాకచక్యంగా వినియోగించుకునే తీరుపై ఆధారపడి చైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున, ఎంపీలు, ఎమ్మెల్సీల ఓట్లతోపాటు ఇండిపెండ్లను తమవైపు తిప్పుకుంటే ఈ నాలుగు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వస్తాయి.

మహబూబాబాద్
మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులున్నాయి. కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 12, సీపీఐ 3, సీపీఎం 3, బీజేపీ 1, ఇండిపెండెంట్‌లు 4 స్థానాల్లో గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 19 స్థానాలు. ఏ పార్టీ దరిదాపుల్లో లేదు. మహబూబూబాద్‌లో సీపీఐ, సీపీఎం, ఇండిపెండెంట్లు కీలక పాత్ర వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ మధ్య దోస్తీ కొనసాగింది. సీట్ల పంపకంలో వచ్చిన విభేదాలతో స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ తీరును వ్యతిరేకించి బీఆర్ఎస్ తో జతకట్టింది. ఇప్పుడు సీపీఐ కాంగ్రెస్‌కు సహకరిస్తుందా? అనేది అనుమానంగా మారింది. చైర్మన్ స్థానం దక్కించుకోవాలంటే కాంగ్రెస్ కు ఆరుగురి మద్ధతు అవసరం, నలుగురు ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకుని ఎక్స్ అఫిషియో మెంబర్ సహకారంతో బయటపడే అవకాశం ఉంది. అయితే తన నియోజకవర్గంలోని కేసముద్రంలో కూడా హంగు నెలకొంది. ఇక్కడ ఒక ఓటు కాంగ్రెస్ కు లభిస్తే చైర్మన్ పీఠం దక్కించుకోవచ్చు. కాంగ్రెస్ కు ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లున్నాయి. లేదంటే ఇక్కడ సీపీఐ బీఆర్ఎస్ తో దోస్తీ కటీఫ్ చేసుకుని కాంగ్రెస్ కు మద్ధతు తెలియజేయాల్సి ఉంటోంది. కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్ మధ్య తిరిగి స్నేహం కుదిరితే మహబూబాబాద్లో సీపీఐ కాంగ్రెస్ మద్ధతు తెలియజేయాలనే షరతు విధించే అవకాశం లేకపోలేదు. లేదా సీపీఎం సహకారం తీసుకోవాల్సి ఉంటోంది. మహబూబాద్ పరిధిలో బీఆర్ఎస్ కు కూడా ఒక ఎమ్మెల్సీ రవిందర్ రావు ఓటు ఉన్నది.

కేసముద్రం
కేసముద్రం మున్సిపాలిటీలో 16 వార్డులున్నాయి. కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8 స్థానాలు దక్కించుకున్నాయి. కేసముద్రంలో ఎక్స్ అఫిషియో ఓటుతో కాంగ్రెస్ గట్టెక్కే అవకాశం ఉంది.

వర్ధన్నపేట
వర్ధన్నపేటలో 12 వార్డులున్నాయి. కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 1 గెలుపొందారు. ఇక్కడ ఇండిపెండెంట్ను తమవైపు తిప్పుకుని ఎక్స్ అఫిషియో ఓటుతో గట్టెక్కే అవకాశం ఉంది. ఇప్పటికే ఇండిపెండెంట్‌ను కాంగ్రెస్ ఎత్తుకపోయినట్లు ప్రచారం సాగుతోంది.

జనగామ
జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులన్నాయి. బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12 స్థానాల్లో గెలుపొందాయి. సీపీఎం 1,స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్, సీపీఎం కలిసి పోటీచేశాయి. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు 13 స్థానాల బలం ఉంది. స్వతంత్రుల్లో నలుగురిలో ముగ్గురు ఎటు వైపు వెళితే ఆ పార్టీ చైర్మన్ స్థానం దక్కుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యంవహిస్తున్న ఏకైక నియోజకవర్గం ఇదే. ఇక్కడ స్వంత్రంత్రుల సహకారంతోపాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఓట్లు వినియోగించుకునే ఛాన్సు ఉంది. అయితే బీఆర్ఎస్ కు కూడా ఎమ్మెల్సీ పోచం పెల్లి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక రాజ్యసభ సభ్యుడు వద్ది రాజు రవిచంద్ర ఓటు కూడా బీఆర్ఎస్ వాడుకునే అవకాశం లేకపోలేదు.

ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకం
హంగు ఏర్పడిన స్థానాల్లో ఇండిపెండెంట్లతోపాటు ఎక్స్ అఫిషియో మెంబర్ల ఓట్లు కొన్ని చోట్ల చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు దోహదం చేయనున్నాయి. ఈ ఎన్నికలో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీ ఓట్లు కీలకం కానున్నాయి. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రాష్ట్రంలో ఎక్కడైనా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండగా, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నియోజకవర్గ పరిధిలోని ఏదేని ఒక మున్సిపాలిటీలో మాత్రమే ఓటు వినియోగించుకోవాల్సి ఉంటోంది.